పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

21


నొందెదవు, అని సర్వోపనిషత్సార మగువిషయము నుపదేశించి, మరల "ప్రస్తుతము నీవు చేయవలసిన కార్య మొకటి కలదు, బ్రహ్మాండపురాణంబునం బార్వతీపరమేశ్వరసంవాదరూపముగ నధ్యాత్మరామాయణము కలదు. దానియందు సీతారామాంజనేయసంవాదరూప' మగు శ్రీరామహృదయ మను నితిహాసము మిగుల సంక్షేపముగ నున్నది. దాని విస్తరించి యొకకావ్య మొనరించి నాకుం గృతి యిమ్ము దీనిచే సకలపాపరహితుఁడ వై, కృతకృత్యుఁడ వగుదువు." ఆని యాజ్ఞాపించి యంతర్థానమును జెందెను. తర్వాత నేనును సమాధిని విడిచి యాచార్యుని పరమానుగ్రహమువలన నుల్లాసముఁ జెందుమనస్సుతో.

——♦♦♦♦§కృతికర్తృభాగ్యప్రశంస.§♦♦♦♦——

శా. శ్రీవిశ్వేశ్వరపార్వతీప్రియదమున్ శ్రీజానకీ రామవా
    క్యావిర్భూతము మారుతాత్మజసుబోధ్యం బై తగన్ శ్రీమహా
    దేవాచార్యవరాంకితంబుగను ధాత్రి న్రాజయోగంబు సం
    భావింపన్ రచియింపఁ గల్గె నిఁక నాభాగ్యంబు సామాన్యమే? 17

టీ. శ్రీ ...దమున్ - శ్రీ = సంపద్యుక్తులైన, విశ్వేశ్వర = ఈశ్వరునకును, పార్వతీ = పార్వతీదేవికిని, ప్రియదమున్ = సంతోషము గలిగించునట్టియు, శ్రీ...భూతము - శ్రీజానకీ = సీతాదేవియొక్కయు, రామ= శ్రీరామునియొక్కయు, వాక్య = వాక్యములనుండి, ఆవిర్భూతము = పుట్టినట్టియు, మారుతాత్మజసుబోధ్యంబు = ఆంజనేయునకు బాగుగఁ దెలుపఁ దగినది. (ఆంజనేయున కుపదేశించినది) ఐ = అయిన, రాజయోగంబున్ = తారకసాంఖ్యామనస్కరూప మగురాజయోగమును, తగన్ = ఒప్పు నట్లుగా, శ్రీ...గను - శ్రీమహాదేవాచార్యవర = మహాదేవయతి యను నాచార్యశ్రేష్ఠునకు, అంకితంబుగను= సమర్పితంబుగ, ధాత్రిన్ = భూమియందు, సంభావింపన్ = సర్వజనులును గౌరవించునట్లుగా, రచియింపన్ కల్గెన్ = చేయుటకుఁ దటస్థమయ్యెను. (కావ్యముగా రచించుట తటస్థ మయ్యె ననుట.) ఇకన్ = ఇప్పుడు, ( లేక, ఇట్లగుటచేత,) నా భాగ్యంబు = నాయదృష్టము, సామాన్యమే = స్వల్పమైనదా?

తా. పార్వతీపరమేశ్వరులకు సంతోషకరమై, మహానుభావుఁ డగు హనుమంతునకు సీతారాములు చేసినయుపదేశమే స్వరూపముగాఁ గలిగిన యీ రాజయోగమును, ఒక ప్రబంధముగా రచియింప సమకూరెను. ఆందును సదాచార్యులలో నుత్తమోత్తముఁ డగుమహాదేవాచార్యుఁడు కృతిపతి యయ్యెను. ఇక నాభాగ్యము నకు మితి గలదా?

క. దివ్యము భవ్యం బగుమ, త్కావ్యము సంతతము మోక్షకాలముచే శ్రో
   తవ్యము వక్తవ్యము మం, తవ్యము భావ్యమును గీర్తితవ్యము గాదే?