పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

15


ములే సత్యము లనియు, నింతకంటె నికరము లగు సౌఖ్యములు లేవనియు భ్రాంతిఁ జెంది పరమానందరూప మగుమోక్షమును గూడ ధిక్కరించుచుఁ దమ కేమియు దెలియకున్నను సర్వమును దెలిసితిమని విఱ్ఱవీగుచుఁ గుతర్కముల నాచరించుచుండు నవివేకులకు నమస్కారము. వా రీదెసకు రాకుండుదురు గాక!

అవ . ఈకవి యిష్టదేవతాప్రార్ధనము ముగించువాఁడై యీ క్రిందిపద్యమున సకలభూతములకును నమస్కారము నాచరించుచున్నాడు.—

మ. గరిమన్ స్వర్ణ మనేకభూషణములై కన్పట్టుచందంబునం
    బరమాత్ముం డఖిలప్రపంచమయుఁ డై భాసిల్లు న ట్లౌటచే
    సురసిద్ధోరగయక్షకిన్నరనరస్తోమాదిశశ్వచ్చరా
    చరరూపోజ్జ్వలసర్వభూతములకున్ సద్భక్తితో మ్రొక్కెదన్.14

టీక . గరిమన్ = గౌరవము చేత, స్వర్ణము=బంగారు (ఒక్కటియైనను), అనేకభూషణములు ఐ = నానావిధములగు (నామములును రూపములును గల) భూషణములుగా నేర్పడి, కన్పట్టుచందంబునన్ = కనఁబడునట్లు, పరమాత్ముండు= నిర్గుణ నిర్వికార పరబ్రహ్మము, అఖిల ప్రపంచమయుఁడు ఐ = అనేకవిధము లగు భేదములగల యీ ప్రపంచమంతయును దానే యై, భాసిల్లున్ = ప్రకాశించుచున్నాడు. అట్లు ఔటచేన్ = కాఁబట్టి, సుర... భూతములకున్ - సుర , సిద్ధ, ఉరగ = నాగకుమారులు, యక్ష, కిన్నర, నర (వీరియొక్క), స్తోమ = సమూహములే, ఆది=మొదలుగాఁ గల, శశ్వత్ = పలుమఱు తిరుగు (జన్మపరంపరల నొందు), చర = జంగమములును (సంచరింపఁగలిగినవి), అచర = స్థావరములును (కదలనేరనివి ) అగు, రూప = మనుష్యులు మృగములు పక్షులు కొండలు వృక్షములు మొదలగురూపములతో, ఉజ్జ్వల= ప్రకాశించుచున్న, సర్వ = సమస్తములైన, భూతములకున్ = జంతుజాలమునకు, సద్భక్తితోన్ = మిగులభక్తితో, మ్రొక్కెదన్ = నమస్కరింతును.

తా. సువర్ణ మొక్కటి యయ్యును అనేకభేదములు గల భూషణములై యున్నట్లు పరబ్రహ్మ మొక్కఁ డయ్యును, నానాభేదములు గల ప్రపంచమై తోఁచు చున్నాఁడు. కావున నీప్రపంచములో నెద్దియు నాబ్రహ్మమునకంటె నితరము కాదు. కాఁబట్టి దేవసిద్ధనాగయక్షకిన్నరమనుప్యసమూహములకును, మఱియు ననేకవిధము లై జంగమస్థావరరూపములగు సకలభూతసంఘంబులకును నమస్కారము చేసెదను. (ఈభూతములు బహరూపము లగుటచే సత్యములయ్యును గల్పితమగు కర్మసంబంధముచే పలుమాఱు జన్మించుచు, మృతినొందుచు, ఒక దేహమును బరిత్యజించుచు, మఱియొక దేహమును గైకొనుచు తిరుగుచుండును. కావున భూతభవిష్యద్వర్తమానకాలములయందలి సకలప్రపంచమునకును నేను మిగుల భక్తితో వందనముల నాచరించెద ననుట.)