పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

9

బరిశుద్ధము చేయఁజాలుతారకయోగము నుపదేశించి పరమార్థతత్త్వమును దెలిసీకొనుటయందు శక్తిని గలిగించిన నారాయణగురువును మదిలోఁ దలంచెదను.

అవ. మఱియొకగురువునకు వందన మాచరించుచున్నాఁడు. —

సీ. ఘనపాపమును మాపఁ దనుతాపమును బాపఁ
          దనరూపమును జూపఁ దనరువాని
    దనుకాయమును ద్రోయఁ బెనుమాయ నొగి మాయ
          ముగఁ జేయ గుఱి డాయఁ దగినవాని
    మును కారణశరీరమును జీఱ నవికార
          వరకారణముఁ జేరఁ బరఁగువానిఁ
    దనయందు జగమందుఁ దాఁ బొందుగా నొందు
          చెలు వొందువిందుగాఁ దెలియువాని
తే. నిగమనిగదితసుగుణము లగణితముగ
    మిగుల నిగుడఁగ సగుణుఁ డై యగుణుఁ డగుచుఁ
    బగలు రే యన కొకరీతి నెగడువాని
   శ్రీమహాదేవగురుని భజింతు నెపుడు. 8

టీక. ఘనపాపమునున్ = అధికమైన పాపమును (బ్రహ్మజ్ఞానమునకుఁ బ్రతిబంధకములై యుండువానిని), పాపన్ = పోఁగొట్టుటకును, తనుతాపమున్ = శరీరమునందలి సంతాపములను (ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, అధిదైవికము అనుతాపత్రయమును; వాత పైత్త్యాదులవలనఁ దనకుఁ గలుగువ్యాధులు ఆధ్యాత్మికతాపము; ఇతర జంతువులవలనఁ గలుగు బాధ యాధిభౌతికతాపము; ఎండ వాన గాలి మొదలగు వానివలనఁ గలుగుతాపసు ఆధిదైవికతాపము; అని యెఱుంగునది. ), మాపన్ = నశింపఁజేయుటకును, తనరూపమును = తనయథార్థస్వరూపమును (బ్రహ్మస్వరూపమును), చూపన్ = కనఁబఱచుటకును (అపరోక్షబ్రహ్మసాక్షాత్కారమును గలిగించుటకు), తనరువానిన్ = శక్తి గలవానిని, తనుకాయమునున్ = సూక్ష్మశరీరమును, త్రోయన్ = నశింపఁజేయుటకుఁగా (హృదయగ్రంథిని ఛేదించుటకు, అనగా: తనకంటే బ్రహ్మము వేఱను భ్రాంతిని తొలగించుకొనుటకు), పెనుమాయన్ = గొప్పది యగునట్టి (సకలలోకములను దనకు వశములను గావించుకొని త్రిప్పునట్టి సామర్థ్యము గల) మాయను, ఒగిన్ = సంపూర్ణముగ, మాయముగన్ = కనుపడనిదానినిగా, చేయన్ = చేయుటకును, గుఱిడాయతగినవానిన్ = లక్ష్యము గా నాశ్రయింప నర్హుం డైనవానిని (ఈయన నాశ్రయించిన హృదయగ్రంథియు, అవిద్యయు నశించుట కేసంశయ ముకు లేదనుట.), మును = మొట్టమొదట, కారణశరీరమును = అవిద్యాస్వరూపమైన