పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi

పీఠిక

ఇఁక ననాదియై లోకమునం దత్యంతవ్యాప్తి గలయద్వైతమత మును దెలుపు దేశభాషా గ్రంథములు సుమారు 400 సంసత్సరముల క్రిందటినఱకు లేనట్టు కనబడుచున్నది.అఱవభాషలోఁ కొన్ని గలవందురు గాని యవియు నంత ప్రసిద్ధములుగా లేవు. తెనుఁగునందు నీటీవల వాసు దేవమననము మున్నగు కొన్ని వచన గ్రంథములు బయలు వెడలినవి గాని యందు సర్వవిషయములను సోదాహరణముగఁ జర్చింపఁబడకుండుటయే కాక యాశైలియు సహృదయహృదయరంజకముగా నుండలేదనియుఁ జెప్పవచ్చును.

ఇఁకఁ బద్యకావ్యమై సరసకవితావిలసితమై యద్వైతమతమునకు సంజీవని యనందగి విలసిల్లు వేదాంత గ్రంథరత్నము ---

సీతారామాంజనేయసంవాదము.

ఇయ్యది మూఁడాశ్యాసముల ప్రబంధము. దీనిని బరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి యనుకవి రచించెను. ఇతఁడు నియోగి బ్రాహ్మణుఁడు . రామమంత్రికిని దిమ్మాంబకును బుత్రుఁడు. శ్రీరా భక్తుడు. మహాదేవయోగికి శిష్యుఁడు . ఇతని కాలాదులనుగూర్చి యాధారము లేవియు దొరకనందున సుమారు 100-150 సంవత్సరముల క్రింద నుండి యుండెనని యూహింపవలసి యున్నది. ఇతఁ డద్వైతమతమును వివరింపఁ బూనియుఁ దాను యోగాభ్యాసపరుఁ డగుటవలన రాజయోగ మును, బాలలోఁ జక్కెరను గలిపినట్లు, అద్వైతమతమునందుఁ గలిపి యేకముగ సమన్వయించియున్నాఁడు.

ఈ వేదాంతమును బార్వతీదేవి శివుని బ్రశ్న సేయఁగా నతఁడు పూర్వకాలమున రామపట్టాభిషేకానంతరము జరిగినసీతారామాంజనేయ సంవాదమును బార్వతికిఁ దెలిపినట్లు గ్రంథకర్త గ్రంథాదియందుఁ బొందు పఱచియున్నాఁడు.