పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న నందం బగు బృందారకేంద్రునిం గని ప్రణమిల్లిన నతనిం గౌఁగిలించుకొని గారవించి దీవించి యాసన్నమణిమయసింహాసనంబుపై సుఖాసీనుం జేసి కుశలం బడిగి సురపతి నరపతి కిట్లనియె. 126

ఆ. ఊర్వశియును రంభయును నాడఁగా మాకుఁ
దారతమ్య మెఱుఁగఁ దరముగాదు
సర్వకళలయందు జాణవు నీ వండ్రు
దీని నిర్ణయింపు మానవేంద్ర. 127

ఆ. అనుచుఁ బలికి మఱియు సాంగసంగీతవా
చ్యాదికృత్యములకు ననువు మెఱయఁ
గడఁగి నిలువుఁ డనుచు గంధర్వులకుఁ జెప్పి
మున్ను రంభ నాడుమన్న నంత. 128

శా. గంధర్వు ల్పదునాల్గు దోషములు దక్కం దాళమానంబులన్
గాంధర్వంబు ధ్రువాప్రబంధసరణిం[1]గా వింపఁగా వాద్యముల్
ధింధింధిక్కధిమిక్కతక్క ధికతోంధిక్కత్తకోఝింకిణిం
ధింధాంఝంకకుఝెక్కుధిగ్ధిగుడధాధీయంచు మ్రోసె న్వెసన్. 129

క. జంభారియెదుట నాట్యా
రంభమ్మున నూర్వశీపరాజయకృతసం
రంభయు నూరుద్వయజిత
రంభయునై రంభ నిలిచె రంగస్థలిపై. 130

క. సురపతిపంపునఁ గూడిన
మురజధ్వను లభ్రశబ్దములుగా శృంగా
రరసము గురియగ నాడెను
దిరుపుల మురిపముల మెఱపుఁదీగయుఁబోలెన్. 131

  1. ధ్రువాదిబంధసరణిం