పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తగఁ దోడంటినపా[1] లిం
    పుగఁ బెరుఁ గయియున్న నది యభోజ్యంబగునే. 26

క. సంబంధము లగురసభా
   వంబులు మునుకంటె నభినవంబులు గలవే
   యంబుధినె కాక బహు ర
   త్నంబులు వర్తకుల కేమి తాఁ బండినవే. 27

క. తల్లి యగు వాణికరుణం
    దొల్లిటికవు లధికు లనఁగఁ దోఁచిరి పిదపన్
    బల్లిదు లిప్పటి సుకవులు
    తల్లికిఁ గడగొట్టు[2] కొడుకు దాఁ బ్రియమగుటన్. 28

క. ఏజనుల కైన సద్గుణ
   యోజితులై భావ మెఱిఁగి యుచితార్థకళా
   రాజితు లగు కవిరాజుల
   రాజులు చేపట్టిరేని రాజ్యము గాదే. 29

క. సరసులు చేపట్టినచో
   విరసం బగుకావ్య మైన వినిపించిన నా
   దరణీయం బయి వెలయదె
   ధరఁ బువ్వులఁ దాల్చి తుంగ[3]తల కెక్కు గతిన్. 30

క. అప్పరమేశ్వరు కరుణం
    గుప్పలు గౌను విక్రమార్కు గుణముల కొఱకై
    చెప్పెద రసభావంబులు
    ముప్పిరిగొనునట్లు కథలు ముప్పది రెండున్. 31

  1. తోడంటునఁ బా
  2. గడపుట్టు
  3. వంకఁ దుంగ