పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lix


శివపరమైన అర్థము - లీలయా = వేడుకతో, భుజంగాన్ = పాములను, మండలీకృత్య = చుట్టచేసుకొని, ధారయన్ = ధరించినట్టి, హరః = శివుడు.

కేశవపరమైన అర్థము - లీలయా = విలాసముతో, భుజం= భుజమును, మండలీకృత్య = వంచి, గాం= భూమిని, ధారయన్ = ధరించినట్టి. వరాహశ్చ = వరాహమూర్తియు నీకు అధిక సంపత్తులు ఇచ్చుగాక. మూలమునందలి ఈ హరిహర స్తుతి గోపరాజునకు స్ఫూర్తి నిచ్చియుండును.

పాఠ పరిష్కరణము:

ఈ కావ్యమునకు కాకినాడలో ఉండిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు పుస్తక భాండాగారమునందు రెండు ప్రతులుండినవి. ఒకటి తాళపత్రప్రతి, రెండవది మదరాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునందున్న ప్రతుల నుండి పాఠములు గ్రహించి వ్రాయించిన కాగితపుప్రతి. ఇవికాక శ్రీ పోతాప్రెగడ బ్రహ్మానంద రావు పంతులుగారి కడ లభించిన వ్రాతప్రతిని, పరవస్తు చిన్నయ సూరిగారు సూచించిన పాఠములు గల ప్రతిని పరిశీలించి పరిషత్తువారు 1933లో ద్వితీయ భాగమును, 1936లో ప్రథమ భాగమును ప్రచురించిరి. ఆతరువాత మరల 1960లో ప్రథమభాగము ద్వితీయ ముద్రణకు నోచుకొనెను. ప్రత్యంతరములు లభింపలేదు. ఇప్పుడు మరల పరిష్కృతపాఠములతో ఈ ప్రతి ప్రకటింప బడుచున్నది.

ఈ పరిష్కరణములో నేను కావ్యమందును, అధస్సూచికలోను ఉన్న పాఠములలో సమంజసములని తోచిన వానిని గ్రహించి తక్కిన వానిని అధస్సూచికలో ఉంచితిని రెండు చోట్ల మాత్రము సందర్భమును బట్టి సవరణలు చేసితిని. నాలుగవ ఆశ్వాసమున సతుల పేళ్ళు తెలుగులో చెప్పు సందర్భమునందు “చెలువయుఁ గలకంఠి చేడియ నెలతుక" (4-221) అని ఉన్నది. 'కలకంఠి' పదము తత్సమముగాని అచ్చతెలుగు కాదు. అందుకై నేను “చెలువ కలువకంటి చేడియ నెలతుక " అని సవరణ చేసితిని.