పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

462

సింహాసన ద్వాత్రింశిక


బును రత్నగర్భాదిపరీక్షణంబును మనుష్యాదిజీవపరిరక్షణంబును ద్యూతాదిఖేలనంబును యమనియమాద్యష్టాంగయోగంబును అష్టావధానంబును వైదికంబును లోకాచారంబును రతిరహస్యంబును వాద్యకౌశలంబును నాట్యంబును బరకాయప్రవేశంబును బరవంచనంబును ఉపాయాపాయవివేకంబును వీరత్వంబును వాచకంబును గందుక కుక్కుటాండ
జలపూర్ణభాండ చక్రభ్రమణంబును బహురూపనటనత్వంబును వేణుదండభ్రమణంబును రాజముఖ మృగముఖ స్త్రీముఖ చోరముఖ దిఙ్ముఖబంధనంబును హాలికప్రయోగంబు నాకారగుప్తియు భావజ్ఞానంబును గ్రామణికత్వంబును లేఖకత్వంబును బరిహాసంబును వాచాలకత్వంబు నిష్కంపవృత్తియు సర్వజాతిశిల్పపరిశీలనంబును నా నీచతుష్షష్టికళలయందును దేవరసాన్నిధ్యంబునం గొంత పరిచితుండ ననిన.[1]

168


క.

భూవల్లభుఁ డాతని వి
ద్యావిజ్ఞానంబు మెచ్చి తనలోపల సం
భావింపఁ దలంచునెడన్
దౌవారికుఁ డేగు దెంచి తగ నిట్లనియెన్.

169


క.

ఓనరనాయక తమకుం
బూనిక ఫలియింపఁ బాండ్యభూపతిమంత్రుల్
కానుకలు గొంచు దేవర
గానం జనుదెంచినారు కడు వినయమునన్.

170


ఆ.

అనిన వారిఁ దోడికొనిరమ్ము నావుడు
మగిడి యేగి యచటిమంత్రివరుల
వాఁడు దోడుకొనుచువచ్చి దర్సింపించె
గనకరత్నచయము మునుముగాఁగ.

171
  1. ఈవచనంబులోని చతుష్షష్టికళలును బ్రతికొక విధముగా మార్పఁబడినవి, సంఖ్య హెచ్చినది.