పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

449


క.

తెలియఁగల దొకటి విను నా
సెలవున నతఁ డర్థ మట్లు చేకొని చనియె
న్వల దనుచు నడ్డపెట్టక
నిలుపక పంపినదిచాలు నీపని యొప్పున్.

104


మ.

అనినం గ్రమ్మఱ మ్రొక్కి వాఁడు నరలోకాధీశ నీయాజ్ఞఁ గాం
చనరత్నాంచితశేఖరంబు కరణి న్సర్వక్షమాధీశులు
న్వినయానమ్రశిరస్కులై శిరముల న్విఖ్యాతిగాఁ దాల్చి నీ
పనివారై నెగడంగ నీ సెలవుఁ దప్పంజేయ నే నెవ్వఁడన్.

105


క.

ఎత్తఱినైనను బతి దన
చిత్తగతిం దగవు మీఱి చెప్పిన పని మా
ఱుత్తర మీయక చేసిన
నుత్తమసేవకుఁడు వాఁడె యుర్వీరమణా.

106


చ.

పనిచినఁ [1]బోనివాఁ డొకఁడు పంచినఁ దా నొరుఁ బంచు నొక్కరుం
[2]డను విది గా దటంచు నెదురాడు నొకం డొకఁ డొంటిఁ బోవరా
దను నొకఁ డప్డు రోగినను నాపని గాదను నొక్కరుండు పొ
మ్మనఁగఁ జలించు నొక్కఁడు జనాధిప [3]యేడ్వురుఁ గష్టసేవకుల్.

107


ఆ.

ఆజ్ఞ దప్పుట పతి యాయువు దరపుట
కాన నర్థ మెంత యైన నేఁడు
వోవుఁగాక యేను దేవరయానతి
దప్పఁజేయుదునె హితత్వ మేది.

108


వ.

దేవ నీయానతి కనుగుణంబుగ నమూల్యరత్నాది సువస్తువు లెల్లను దాఁపురంబు చేయక చూపిన నతండు తన యిచ్చకొలందినె యవారితంబుగా

  1. బోయిరాఁ డొకఁడు
  2. డను నిది గా దటంచు
  3. యార్వురు అని మూ.