పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

430

సింహాసన ద్వాత్రింశిక


ఉ.

యాచకపారిజాత మని యర్థులు దన్ను నుతింపఁ ద్యాగభో
గాచరణంబునం బరఁగి యబ్ధులు మేరగ నుర్వియెల్ల సం
కోచము లేక యేలుచు నకుంఠితవిక్రముఁడై విదేశముల్
చూచుమనంబుతో నతఁడు జోగివిధంబున నేగి యొక్కఁడున్.

5


ఆ.

గురిజపేరు లఱుతఁ గొమరార ధరియించి
యడవిమొల్లలఁ గురులందుఁ జెరివి
పాఱుటాకులు మొలబాగుగాఁ గట్టి యే
తెంచుచెంచుసతులఁ గాంచి కాంచి.

6


క.

మాకందములును రక్తా
శోకములును జంపకములు సురపొన్నలు నా
లోకించుచుఁ బ్రియపడి నరఁ
లోకేశుం డొక్కవనములోఁ దిరుగంగన్.

7


సీ.

అతని ప్రతాపాగ్ని నవమానితంబైన
        పగిది బింబమునఁ దాపంబు వొదల
నంభోజహితుఁడు మధ్యాహ్నకాలంబున
        నిప్పులు వర్షించుచొప్పు దోఁప
సర్వజంతువుల కసహ్యంబుగా మహా
        నగము లెండఁగ నెండ నిగుడఁజేయఁ
బలుచనయ్యును జౌటిపట్టులు వేఁడిమిఁ
        గసవులు మొదలారఁ గమరఁజొచ్చె


ఆ.

విహగకులము తాము విహరించుతరువుల
కేగ కీరములను నీఁగఁదొడఁగె
వడ ఘనంబు గాఁగ వాయువు వీతేర
జగము శూన్యమైన చంద మొందె.

8