పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

401


దెల్లని చుక్కలఱేఁడును
దెల్లనిచదలేఱు గలుగు తెల్లనివేల్పున్.

32


శా.

చేతఃపద్మమునం దలంచి [1]విహితాశీర్వాదభూమీసుర
వ్రాతంబున్ హితవర్గముం [2]గొలువ సౌవర్ణోజ్జ్వలద్భూషణా
న్వీతుండై సుదినంబునం గదఁగి దేవేంద్రాసనాసక్తితో
నేతేరం గని బొమ్మ వల్కె వసుధాధీశు న్నివారించుచున్.

33


క.

కార్యంబు గాని చేతలు
మర్యాదలుగా వవంతిమనుజేంద్రుక్రియన్
ధైర్యమును సత్యమును నౌ
దార్యంబును లేక యెక్కఁదగ దన్యులకున్.

34


ఉ.

ఆతనిధర్మవర్తనకథామృతపానముఁ గోరుదేని పృ
థ్వీతలనాథ నిల్చి విను ధీరుఁ డుదారుఁడు శూరుఁ డాతఁ డ
త్యాతతకీర్తికాముఁడు [3]సదామితదానవినోది సాహస
ఖ్యాతచరిత్రుఁ డార్తహితకారణశీలుఁడు నేల యేలఁగన్.

35


మ.

గజవాజిప్రముఖంబులౌ బలములన్ గర్వంబు రెట్టింప న
క్కజమౌ రాజ్యము సేయురాజులు మదిం గంపించి సేవింపఁగాఁ
బ్రజలెల్లన్ ధన్యధాన్యపుత్రవనితాభాగ్యంబులం బొందియు
న్నిజధర్మంబులు దప్పకుండిరి [4]మహానిర్వాహులై యందఱున్.

36


శా.

ఆకాలంబున విక్రమార్కుఁడు విధేయం బైన దేశాంతరా
లోకాసక్తి మహిం జరింపఁ జని వాలుం జోగివేషంబు ని
త్యాకల్పంబుగ నంతటం దిరిగి ప్రత్యావృత్తుఁడై వచ్చుచో
నాకర్ణించె నతండు కాఱడవిలో [5]హంభాయనున్ ధేనువున్.

37
  1. విహితాశీర్వాదమౌ భూసుర
  2. గొలువ నాస్వర్ణోజ్వలద్భూషణా
  3. సుధాకరదానవినోది; నుదారసదానవినోది
  4. మహానిర్వాణులై యుర్వరన్
  5. నంభారవం బారగన్