పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xlv

నూనె, కలినీళ్ళు, క్రొవ్వు, తేనె త్రాగిన చెడ్డది. కోతి, పొగ, కాకి కనబడిన చెడ్డది. ఈ శుభాశుభములను విడిగాకాక కలిపి కలగావులగము చేసినాడు. ఇది శాస్త్రీయ పద్ధతి కాదు. (9-71)

15. జ్యోతిషము- ఇరువదియైదవ సాలభంజిక కథలో మూలమున దీర్ఘక్షామము ఏర్పడు గ్రహగతులు చెప్పబడగా గోపరాజు వానితోబాటు సామాన్యములైన గ్రహస్థానములు - ఫలములు మాత్రము చెప్పెను. ఆతనికి ఈ శాస్త్రమున విశేష పరిచయముండినచో విశేషముగ వ్రాసి యుండును

16. జూదము, ఆటలు- ఇరువది యేడవ సాలభంజిక కథలో ఒక జూదగాని ప్రస్తావన ఉన్నది. వాడు తన్నుగూర్చి “దురోదర విషయే అహమేవ విచక్షణః, నాన్యః, అన్యచ్చ వారిక్రీడాం వరాట ముష్టించ జానామి” అని మాత్రమే చెప్పెను. ఇందలి వారిక్రీడ, వరాట ముష్టి అను ఆట లెట్టివో తెలియదు. గోపరాజు వానిని వదలి తెలుగువారికి ప్రియమైన ఆటలు చతురంగము- పాచికల ఆట, పులిజూదములను పేర్కొన్నాడు. (10-87)

17. చోరకళ - మూలమునలేని చోరవిద్యను గోపరాజు అదనముగా చెప్పెను. ఇందు చోరులు ఎట్టి వేషముతో ఉందురో, వెంట ఏయే వస్తువులు గొనిపోదురో, ఎట్లు మెలగెదరో, ఏమేమి చేయుదురో విపులముగా తెలిపినాడు. (10-117)

18. గణక పద్దతులు - మూలమున లేకున్నను గణకుని విధులు, ఆయ వ్యయముల లెక్కలు వ్రాయు పద్దతులు, వ్రాయకూడని విధానములు విపులముగా చెప్పబడినవి. రాజకోశముల దగ్గర ఉండు గణకులు వ్రాసిన లెక్కలను, వ్రాతలను ప్రభువు స్వయముగా పరిశీలించవలెనట. ఈగణకులే కరణములట.

క. కరణము తన యేలిక కుప
   కరణము, నిర్ణయ గుణాధికరణము, ప్రజకున్