పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

సింహాసన ద్వాత్రింశిక

దశమాశ్వాసము

ఇరువదియైదవ బొమ్మకథ

క.

శ్రీదయితావదనచ్ఛా
యాదర్శీభూతకౌస్తుభారుణతేజో
మేదురవక్షఃస్థలు దా
మోదరుఁ గాకోదరేంద్రయోజితతల్పున్.

1


క.

నెమ్మనమునఁ దలఁపుచు మో
హమ్మున సింహాసనమున కరుదెంచినఁ జో
ద్యమ్ముగ నిరువదియేనవ
బొమ్మ వలికె [1]నడ్డపెట్టి భోజనృపాలున్.

2


క.

ఏమని చెప్పుదు నుజ్జయి
నీమనుజాధిపునిభంగి నియతంబుగ నో
భూమీశ్వర దివ్యంబగు
సామర్థ్యము లేక యెక్కఁ జన దెవ్వరికిన్.

3


మ.

అది యెట్లన్న నెఱుంగఁ[2]జెప్పెద నరివ్యాపాదనాపాదనో
న్మదబాహాయుగళుం డనంతధనదానప్రీణితక్ష్మాతల
త్రిదశస్తోమనిరంతరస్తుతిలసత్కీర్తిప్రియుం డంగనా
మదనాకారుఁ డవంతినాయకుఁడు సామ్రాజ్యంబుతో నొప్పుచున్.

4
  1. నడ్డు పెట్టి
  2. జెప్పెదను సువ్యాపారశౌర్యోదయోన్మద