పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

సింహాసన ద్వాత్రింశిక


క.

నీరాజ్య మల్ప మిది యిఁక
నేరీతులఁ జూడ నీకు నింకన్నధిక
శ్రీరమ్య మైన రాజ్యము
చేరంగల దనుచు వారు చెప్పిరి పతికిన్.

60


ఉ.

అత్తఱి వచ్చి యొక్కఁడు రయంబున మ్రొక్కి నృపాలశేఖరా
యుత్తరదేశ మేలెడు నృపోత్తముఁ డీల్గిన మంత్రు లన్యులం
జిత్తములందు మెచ్చక విశిష్టగుణాఢ్యుఁడ వంచు రాజ్యము
న్విత్తముఁ గూడ నీ కొసఁగు వేడుకఁ [1]బుచ్చినఁ గానవచ్చితిన్.

61


చ.

అనవుడుఁ జోద్యమంది యతఁ డాప్తులమాటలు నిక్కమైన నె
మ్మనమునఁ బొంగి వారికిఁ గ్రమంబునఁ గోరిన వాని నెల్ల మె
చ్చున కొనఁగూడ నిచ్చి తగుశూరులు వీరులుఁ గొల్వ నుత్తరం
బున కధికప్రతాపమునఁ బోయె నరాతికులంబు బెగ్గిలన్.

62


వ.

అంత నద్దేశంబుఁ బ్రవేశించుచు మనోల్లాసంబున.

63


క.

తఱచైన మంది ముందఱఁ
[2]బరువడిఁ జని తలఁగ ధరణిపతి తురగంబుం
బఱపుచు [3]ముందలఁ దనకల
విఱిచినక్రియ గ్రుంతఁ గాలు విఱుగంబడియెన్.

64


వ.

అప్పు డందఱును హాహాకారంబుల గుంపులు గూడుకొని పలువరింపంగ వారిలో [4]సద్యస్సంధాననిపుణుం డగుజెట్టి ఫట్టి దట్టి గట్టిగాఁ గట్టి మంత్రించి [5]సుఖితుం జేసిన సుఖాసనంబుపై నాసీనుండై చనంగ.

65
  1. బంచిరి
  2. బరిపిరి
  3. మోదల
  4. శల్యసంధాననిపుణు
  5. నుచిత్తుం జేసి