పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

375


సీ.

అట్టిపట్టణ మేలు నమ్మహీకాంతుఁడు
        దేశాంతరాసక్తిఁ దిరుగుచుండు
నెలమితో షణ్మానములు పుచ్చి మగిడిన
        నప్పుడు మంత్రులు నాప్తజనులుఁ
బౌరు లుదారులుం బరివారమును గూడి
        పీలికూటంబులు మేలికట్లు
తలిరుఁదోరణములు నలరుపందిరులును
        మొకరతో రణములు మున్ను గాఁగఁ


ఆ.

బురి యలంకరించి కరిరాజు మున్నిడి
కదలి పంచవాద్యఘనరవముల
నెసఁగు దర్సెనంబు లిచ్చి యెదుర్కొని
తెచ్చి రుత్సవంబు పిచ్చలింప.

45


ఉ.

ఆజననాయకుడు జవనాశ్వము లెక్కి చెలంగి ముందటన్
రాజులు భృత్యులై కొలువ రత్నవిభూషితమూర్తులైన యం
భోజదళాక్షు లారతులు మున్నుగఁ దన్నుఁ బురస్కరింపఁగా
రాజగృహంబు సొచ్చెఁ గవిరాజనవామరరాజభూజమై.

46


ఉ.

ఈపగిదిన్ గృహంబునకు నేఁగిన యాతఁడు తొల్లి యోగని
ద్రాపరిశీలియయ్యు నుచితంబుగ రాజ్యము చేసె నేర్పునం
దాపసవేషియై జవపదంబులు గ్రుమ్మరి క్రమ్మఱన్ ధరి
త్రీపరిపాలనాభిరతి దేఁకువకెక్కిన రాముకైవడిన్.

47


ఉ.

పెక్కుదినంబు లక్కడ నభీష్టవధూజనమందిరంబులం
దొక్కొకనాఁడు రేయి మదనోత్సవలీలలఁ దేలుచు న్విభుం
డక్కఱ దీఱఁ దొంటి విరహవ్యథ నెక్కుడు స్రుక్కి మిక్కిలి
న్మక్కువ కెక్కువైన [1]మగనాలి గృహంబున రాత్రిపుచ్చుచున్.

48
  1. మృగనాభిగృహంబున-అని యన్నిప్రతులలోను