పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

357


గతులు చెలంగఁ బాదకటకంబులు మ్రోయఁగ నాట్యమాడె నొ
క్కతె తొలుకారుక్రొమ్మెఱుఁగు కైవడిఁ దద్రసభావపుష్టిగన్.[1]

172


క.

ఎలనాఁగలు మఱి తమలో
పల నృత్తాంగములు వీడువడ నాడుచుఁ గ్రొ
న్నెలతాల్పువేల్పు నీక్రియఁ
గొలిచి మగిడి యేగునపుడు గుడిలో మూలన్.

173


శా.

విస్మేరాకృతినున్న మంత్రితనయు న్వీక్షించి ప్రోయాండ్రు మం
దస్మేరానన లౌచు నీకు సుఖమందం గోరుకు ల్గల్గెనే
నస్మద్భూమికి రమ్మటంచుఁ జనఁగా నయ్యుష్ణతీర్థోష్మల
న్భస్మం బయ్యెద నంచు భీతి నతఁ డాప్రాంతంబున న్నిల్చినన్.

174


క.

పాతాళంబున కేగిన
యాతరుణులదీప్తి భూతలాంతంబున ను
ద్యోతించునొ యనఁ దూర్పున
నాతతమగు కెంపుదోఁప నరుణుఁడు వొడచెన్.

175


మ.

దిననాథుం డుదయింపఁగా వెడలి భక్తిన్ గౌతమీతీరకా
ననము ల్దూఱుచు నొక్కనాఁడు కడుఁ బుణ్యంబైనకాళేశ్వరం
బున కేతెంచి మహోపచారపరుఁడై ముక్తీశ్వరుం గొల్చి నె
మ్మన ముప్పొంగఁగ ధన్యుఁడై మగుడఁ దన్మార్గంబున న్వచ్చుచున్.

176


క.

హరిహరు లేకం బనియెడు
పురాణవచనంబు దృష్టముగ నొకచోటన్
నరసింహుండును రామే
శ్వరుఁడును గలధర్మపురికి వచ్చెఁ గడంకన్.

177
  1. ఈ చంపకమాలకు ప్రత్యంతరములో
    గీ. కంకణములు తాళగతి చెలంగఁగఁబాద
    కటకములును మ్రోయ నటనచూపెఁ
    దరుణి యొకతె క్రొత్తమెఱపుకైవడి నిండి
    రసము భావపుష్టిఁ బొసఁగుచుండ.