పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxii

“సంస్కృతమున విక్రమార్కచరిత్ర అను పేరుతో గ్రంథము కలదు. దానిలోగల కొన్ని కథలతో ఇందలి కధలకు వస్తుసామ్యము కలదు. అంతమాత్రమున అది ఈగ్రంథమునకు మాతృకయని చెప్పజాలము. మరి జక్కన ఇది అనువాదము అనిగాని, స్వతంత్ర రచన అనిగాని చెప్పలేదు. అందువలన ఇందు చాల భాగము అతని స్వతంత్ర రచనయే అని ఊహింప వచ్చును" అనివ్రాసిరి. [1]

జక్కనకవి గోపరాజు అనుసరించిన సంస్కృత విక్రమార్క చరిత్రమును చూచి అందుండి కొన్ని కథలను తీసికొని వాటిక్రమమును మార్చి తన పద్దతిలో వ్రాసెను, అతడు గ్రహించిన కథలు.

ద్వితీయాశ్వాసము- 1. విక్రమార్కుడు స్వర్గమునకుపోయి రంభా ఊర్వశుల నాట్యముల తారతమ్యమును నిర్ణయించి ఇంద్రునిచే దివ్య సింహాసనము పొందివచ్చిన కథ.

2. విక్రమార్కుడు కనకస్తంభ పీఠముపై నెక్కిపోయి సూర్యుని చేరి ఆయన అనుగ్రహించిన దివ్యకుండలములను ఒక బ్రాహ్మణునకు దాన మిచ్చిన కథ.

3. విక్రమార్కుడు వేటకు బోయి వరాహమును తరుముచు రసాతలమును చేరి బలిచక్రవర్తిని ఆయన ప్రసాదించిన రస రసాయనములను కొనివచ్చి దరిద్రబ్రాహ్మణునకు ధారపోసిన కథ.

4. మధురానగరము దగ్గర ప్రతిరాత్రి ఒక స్త్రీని కశాఖాతములచే బాధించుచున్న రాక్షసుని చంపి విక్రమార్కుడు ఆమె ఇచ్చిన మణిని వైశ్యపుత్రుడు పురందరునకు ఇచ్చిన కథ.

  1. ఆంధ్ర సాహిత్య చరిత్ర