పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii


కొరవి గోపరాజు ఈ సింహాసన ద్వాత్రింశికను వ్రాసెను. ఇది సంస్కృత విక్రమార్క చరిత్రకు పూర్తిగ అనువాదమైనను గోపరాజు సందర్భానుసారముగ అందందు అనేక విషయములను మఱికొన్ని కథలను చేర్చినాడు . ఆ తరువాత పుత్తేటి రామభద్ర కవి 'సకలకథా సారసంగ్రహము' ను, వెన్నెలకంటి అన్నయ్య 'షోడశకుమార చరిత్ర'ను, కూచిరాజు ఎర్రన్న 'బేతాళ పంచవింశతి'ని, పాలవేకరి కదిరీపతి 'శుక సప్తతి'ని, అయ్యలరాజు నారాయణామాత్యుడు 'హంసవింశతి'ని, ఎర్రన 'సకల కథా నిధానము'ను రచించిరి. ఇవన్నియు కథాకావ్యములే. ఇవి అనల్పకల్పనా సామర్థ్యముతో ప్రబంధ ఫక్కిలో వ్రాయబడిన మనోహర కావ్యములు.

కవి వంశము- కావ్యావతారికలో గోపరాజు తన వంశక్రమమును ఇట్లు తెలిపెను.

'గోపరాజు నియోగి బ్రాహ్మణుడు, హరితస గోత్రుడు. 'కొరవి' అను గ్రామమునుబట్టి ఆ యింటిపేరు వంశనామమైనది. తెలుగువారి ఇంటిపేర్లు గ్రామములను బట్టి, వారు చేయుచుండిన వృత్తులను బట్టి, వంశప్రముఖులను బట్టి ఏర్పడుచుండును. కొరవి వంశమునకు మూలపురుషుడు వెన్నామాత్యుడు. ఆయన చందవోలు రాజధానిగా తెలుగు దేశమును పాలించిన వెలనాటి పృథ్వీశ్వర రాజునకు ప్రధాన మంత్రిగా ఉండెను. దాక్షారామ శాసనములలో వెన్నామాత్యు డిట్లు ప్రశంసింపబడినాడు: “మంత్రి శిఖామణిః బుధనిధిః శ్రీ వెన్ననామాసుధీః" ఆ చందవోలు నేడు గుంటూరు మండలములో ఉన్నది వేంగీచాళుక్యులకు సామంతులైన వెలనాటిచోడవంశీయు లీప్రాంతమును పాలించిరి. గోపరాజు తన వంశమూలపురుషు నిట్లు వర్ణించెను.

“కలుష మాండలిక భేక ఫణీంద్రు డన, రాయ
       గజ గంధవారణ ఖ్యాతి మెఱసి,