పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

229


సీ.

కుప్పలు గొనఁజల్లుపుప్పొడి యెరువుగాఁ
        బొరిఁబొరివిరహాగ్నిఁ బొగులఁజొచ్చె[1]
ఘనసార మిళితచందనపంక మురమునఁ
        దొడిఁదొడి నెఱియలు విడిచి చిటిలె
సెజ్జపై బఱిచిన చెంగల్వరేకులు
        స్రుక్కి మై సోఁకినఁ జూర్ణ మయ్యె
విసనకఱ్ఱలు చేసి విసరుచో నావులఁ
        గదలీదళంబులు గ్రాఁగి ముఱిఁగె


ఆ.

మోవికెంపు డిందె ముత్తియంబులు గందె
గంకణముల లక్క కరఁగిపాఱెఁ
జలువమందు లెల్లఁ జెలువ మందఁగఁ జేయ
నెడఁద మదనతాప మినుమడించె.

130


క.

కలకలఁ బలికెడు చిలుకల
కలకలములుఁ గోకిలముల కలరవములు నా
కులపఱుప నళికులంబులు
నులుకఁగ నయనముల జలము లొలికెం జెలికిన్.

131


వ.

ఇట్లు పెచ్చగిల్లిన[2] పచ్చవిల్తువెచ్చ వెచ్చు నెచ్చెలిం జూచి కలంగి ప్రబలదర్పితుం డగు నాదర్పకుని దూఱం దలంచి చతురిక యిట్లనియె.

132


క.

వలరాజ నిన్ను రూపున
గెలిచిన జీమూతవాహు గెంటింపఁగ లే
కలఘుమతి నబల నొంచెదు
పలువురు వినిరేని బంటుపంతము డిగదే.

133
  1. విరవిర విరహాగ్ని విరియఁజొచ్చె
  2. పిచ్చగిల్లిన; పెచ్చు పెరిఁగిన