పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xix

ద్వాత్రింశోపాఖ్యానము- ముప్పది రెండవ సాలభంజిక, విక్రమార్కుని విశేషముగ ప్రశంసించి, భోజరాజా! నీవును అంతటివాడవు, నీ వలన మాకు శాపమోచనమైనదని చెప్పి తమకు పార్వతీదేవి శాపము, ఆమె పరిచారకలైన తమ పేర్లు, శాపమోక్ష విధీ తెలిపి నీవలన ముక్తి పొందితిమి అని వరము లొసగి 32 సాలభంజికలు దివ్యాంగనలుగా మారి వెళ్ళిపోవుదురు. భోజుడు ఆ దివ్య సింహాసనముపై దేవుని నిలిపి పూజించును.

ఈ మూలకథల నన్నిటిని గ్రహించి గోపరాజు తన కావ్యమున సందర్భానుసారముగ పెంచి మార్చి రచించినాడు.

సింహాసన ద్వాత్రింశికలోని కథలు, :

కైలాసమునందు గౌరిదేవి శంకరుని కథ చెప్పుమనును; శివుడు భోజరాజునకు సింహాసన సాలభంజికలు 32 చెప్పిన కథలు చెప్పెదను వినుమని చెప్పదొడగేను.

ఉజ్జయినీ పురమును చంద్రగుప్తుని పుత్రుడు భర్తృహరి పాలించుచుండెను. అతని భార్య అనంగసేన. ఆమె చెడు వర్తనము వలన విరక్తుడై విక్రమార్కునకు రాజ్యము కట్టి వెళ్ళెను. విక్రమార్కుడు మహాకాళుని గూర్చి తపమొనర్చి మెప్పించి ఒక సంవత్సరము మీద ఒక దినము వయసుగల కన్యకు బుట్టిన వానితో మాత్రమే చావు కలుగునట్లు వరము పొందెను. భట్టి చాతుర్యము వలన 2 వేల యేండ్లు బ్రతుకును; బేతాళుని వశము చేసికొనును, స్వర్గమునకు పోయి రంభా ఊర్వశుల నృత్య విశేషములు వివరించి ఇంద్రునిచే దివ్య సింహాసనము సంపాదించెను. చివరకు ప్రతిష్టానపురము నందలి శాలివాహనుడను బాలునిచే మరణించును. . అశరీరవాణి చెప్పినట్లు ఆ సింహాసనమును విక్రమార్కుని మంత్రులు భూమిలో పాతిపెట్టి ఆ భూమీ నొక బ్రాహ్మణునకు దానమిచ్చెదరు.