పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 137

ధుూపదీపాదిషోడశోపచారంబుల నారాధించి పంచమహావాద్యప్రపంచంబుల నృత్తగీతాదిమహోత్సవంబులు మెఱయఁ గర్పూరాదిసుగంధద్రవ్యంబులతో నింతులతో వసంతఖేలనం బొనర్చె. 172

క. వ్యక్తంబుగ సతిపై ను
న్ముక్తం బగు కప్పురంబు ముద్దర లల్పా
సక్తం బై యలకలపై
ముక్తాజాలకముచందమునఁ జెన్నొందెన్. 173

క. చెలఁగుచుఁ బతి చల్లినఁ దొ
య్యలుల ముఖాబ్దములఁ గొంత యంటి సుగంధం
బలవడియె మెఱుఁగుటద్దం
బుల నంటిన మెఱుఁగుఱాతిపొడియును బోలెన్. 174

క. సురభితహరిదంతరనవ
పరిమళసంకీర్ణపూర్ణపరిమళమునఁ ద
త్తరుణులముఖముకురంబులు
సరజస్సరసీరుహముల చందము నొందెన్. 175

క. సుందరులఁ గూడి వైభవ
బృందారకపతి వసంతపీతాంబరుఁ డై
బృందావనమున గోపీ
బృందాన్వితుఁ డైనకృష్ణువిధమున నొప్పెన్. 176

మతకోకిల. కుంభినీనికరంబుతో నొనగూడి యాడుమహాటవీ
కుంభిచందము దోఁపగా నతిగుంభితప్రమదంబునం
గుంభీనీపతి మందయానలఁ గూడి వేడుకతోడుతన్
జృంభితాంబర మౌ సరోవరసీమఁ జేరెఁ గ్రమంబునన్. 177