పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xviii

పంచవింశోపాఖ్యానము - ఇరువది అయిదవ సాలభంజిక, ఒకసారి ద్వాదశ వర్ష క్షామము వచ్చెను. విక్రమార్కుడు తన కంఠము నరకుకొన నెంచగా దేవి ప్రత్యక్షమై క్షామబాధ పోగొట్టిన కథ చెప్పును.

షడ్వింశోపాఖ్యానము - ఇరువది ఆఱవ సాలభంజిక, విక్రమార్కుని గుణములను పరీక్షింప వచ్చిన కామధేనువు అతని సాహసమును మెచ్చి స్వాధీనము కాగా, దానినొక దరిద్రునకు దానమిచ్చిన కథ చెప్పును.

సప్తవింశోపాఖ్యానము - ఇరువది యేడవ సాలభంజిక, విక్రమార్కుడు భైరవుని మెప్పించి మటత్రయ ధనమును జూదరికి ధారపోసిన కథ చెప్పును.

అష్టావింశోపాఖ్యానము - ఇరువది యెనిమిదవ సాలభంజిక విక్రమార్కుడు బేతాళపురిలోని శోణితప్రియ అను దేవతను మెప్పించి నరబలి మాన్పించిన కథ చెప్పును.

ఏకోనత్రింశోపాఖ్యానము - ఇరువది తొమ్మిదవ సాలభంజిక , విక్రమార్కుడు ఒక భట్టునకు తన రత్నభాండాగారము నుండి కోరిన ధనరాసులు కొనిపోవననుజ్ఞ ఇచ్చిన కథ చెప్పును.

త్రింశోపాఖ్యానము - ముప్పదవ సాలభంజిక, విక్రమార్కుడు ఒక ఐంద్రజాలికుని విద్యామహిమకు మెచ్చి తనకు పాండ్యరాజు పంపిన కప్పమును కానుకలను ధారపోసిన కథ చెప్పును.

ఏకత్రింశోపాఖ్యానము - ముప్పదియొకటవ సాలభంజిక, విక్రమార్కుడు దిగంబరుని కోరికపై బేతాళుని పట్టి తెచ్చుచుండగా కాలక్షేపమునకై బేతాళు డొక కథ చెప్పి దానిని గూర్చి ప్రశ్నించును. రాజు సమాధానము చెప్పగా మౌనభంగము కలిగి బేతాళుడు పారిపోవును. ఈ విధముగా 25 కథలు చెప్పి తప్పించుకొని చివరకు బేతాళుడు దిగంబరుని చంపించి విక్రమార్కునకు వశుడగును. వాసిని బ్రతికించి అష్టసిద్ధులను సమర్పించిన కథ చెప్పును.