పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98 సింహాసన ద్వాత్రింశిక

సుళ్ళెన్ని గలిగిన సుఱ్ఱున స్రుక్కక
యనుకయ్యుఁ బరులకు ననువుగాక
సరివారిలోపల నురువులు గ్రమ్మఁగా
నేలపైఁ బొరలియు బేలుగాక
తనలోన బడబాగ్ని దరికొని మండియు
వడగాలి మీలపై సుడియనీక
ఆ.బయలుపడియును దనలోతు బయలుపడక
దిగులుపఱిచియు నొండెడ దిగులుపడక
యిసుముకంటెను గుణమణు లెసక మెసఁగ
నసమరసమయమైన వెక్కసమువాని. 161

వ. మఱియు గంగాతరంగిణీసంగతంబై హరజటాజూటంబునుంబోలె శంఖాలంకృతంబై విష్ణుభుజంబునుంబోలె వజ్రసముజ్జ్వలంబై పురందరుకరంబునుంబోలె ముక్తామయంబై ముక్తిపథంబునుంబోలె నీలసమగ్రంబై సుగ్రీవసైన్యంబునుంబోలె విజృంభితపద్మరాగంబై శరత్సమయంబునుంబోలెఁ బుష్పితపుష్యరాగంబై శిశిరంబునుంబోలెఁ బ్రసరత్తుషారంబై
హేమంతంబునుంబోలెఁ బటువిద్రుమచ్ఛాయంబై వసంతంబునుంబోలె నుద్దండరాజీవంబై గ్రీష్మంబునుంబోలె నాభీలకూలంకషంబై వర్షాగమంబునుంబోలె మీనమిథునకర్కటమకరాదిసంచారంబై గ్రహమండలంబునుంబోలెఁ బరభీతసపక్షభూభృత్కులాశ్రితంబై మహాదుర్గంబునుంబోలె నొప్పు నప్పూరంబుగలవాని. 162

క. ఆనీరధి నెల వింతనఁ
గానేరము తేలగిలు మకరములమీఁదన్
మైనాకాదులు ఱెక్కల
తో నిలుచుం గరులమీఁది దోమలకరణిన్. 163