పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 85

మ. తనదివ్యప్రభ లీక్రియ[1] న్వెలుఁగఁగాఁ దార్క్ష్యుండు పక్షాగ్రచా
లనవాతాహతితోన మేఘములు డొల్ల న్మిన్ను ముట్టంగ నే
పున దీపించుట లీలఁ గోపమును రూపుం జూపి చక్రాహతి
న్వనజాక్షుండు నృపాలపంక్తి ననిపెన్ వైకుంఠసంప్రాప్తికిన్. 147

వ. ఇట్లు చేసి తదనంతరంబ తజ్జయంబు విదితంబు సేయం బూని. 148

ఉ. ధన్యజనానుకూలుఁ డగు దానవసంహరుఁ డొత్తె నటమూ
ర్ధన్యము భక్తసద్గతివదాన్యము నిర్జితగర్జితోగ్రప
ర్జన్యము ఛిన్నభిన్నపరసైన్యము దిక్కరికర్ణకీర్ణకా
తిన్యము గౌళికావనదృఢీకృతజన్యముఁ బాంచజన్యమున్. 149

క. ఇటు వానిపేరుగా ను
త్కట మగు జయ మిచ్చి చక్రధరుఁ డేగిన ను
ద్భటవృత్తి గౌళికుఁడు న
చ్చట చని రణమండలమునఁ జచ్చిననృపులన్. 150

చ. కనుఁగొని మామఁ బిల్చి ననుఁ గంటివె వచ్చిన యీనృపాలురం
దునిమితి వీరి సంపదలు దొద్దులుగాఁ గొనికమ్ము నీపురం
బున కని చెప్పి తొంటిగతిఁ బోయి సులోచనఁ గూడి దాని కిం
పొనర విహారము ల్సలుపుచుండె ననేకదినమ్ము లిమ్ములన్. 151

క. కావునఁ దెం పెఱిఁగి యస
ద్భావున కచ్యుతుఁడు తోడుపడియె ననంగా
నావిక్రమార్కునకు నతి
పావనునకు సురలు తోడుపడు టచ్చెరువే. 152

ఉ. ఉల్లసితక్షమాభరణుఁ డుజ్జయినీపతిఁ బోలవచ్చునే[2]
యెల్లముఖంబుల న్విష మనేకవిధంబుల నొల్కుచుండఁగా

  1. దనుజారాతియు నీక్రియన్
  2. నెన్నఁబోలునే