పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

అను శ్లోకముతో ముగియును. గోపరాజు ఈ పద్దతినే అనుసరించెను. గోపరాజు మూలము నెట్లనుసరించెనో ఉభయ గ్రంథముల కథాక్రమమును పరిశీలించిన తెలియగలదు.

సంస్కృత మూలకథలు :

ప్రథమోపాఖ్యానము- ఉజ్జయిని రాజధానిగా మాళవ దేశమును భర్తృహరి పాలించుచుండెను. అతడు భార్య అనంగసేన దుష్ప్రవర్తన వలన విరక్తుడై , తమ్ముడగు విక్రమార్కునకు పట్టము గట్టి అడవులకు పోవును. విక్రముడు రాజై తన సాహస కృత్యములచే బేతాళుని వశము చేసికొని ప్రజారంజకముగ రాజ్యమేలెను. స్వర్గమునకు బోయి రంభా ఊర్వశుల వివాదము తీర్చి, ఇంద్రునిచే దివ్య సింహాసనమును పొందెను. చిరకాలము రాజ్యమేలి ప్రతిష్ఠాన పురములోని 2 సం| 6 నెలల కన్యకకు పుట్టిన శాలివాహనునిచే మరణించెను. దివ్యవాణి ఆదేశముచే మంత్రులు విక్రమార్కుని సింహాసనమును భూస్థాపితము చేసి ఆ భూమినొక బ్రాహ్మణునకు దాన మిచ్చిరి.

ఆ బ్రాహ్మణ వంశీయుడొకడు ఆ భూమిలో జొన్నలు సెనగలు పైరు వేసి సింహాసనమున్న దిబ్బపై మంచవేసికొని చేనుకావలి కాయుచుండెను. భోజరాజు సైన్యములతో అచటికి వచ్చును. విప్రుడు మంచెపై నుండి సైనికుల నాహ్వానించి దిగినతోడనే దూషించును. దీనిని గమనించి భోజరాజు ఆ భూమిని కొని మంచె ఉన్నచోట త్రవ్వించగా సింహాసనము కనబడును. ఎంత ప్రయత్నంచినను సింహాసనము పైకిరాలేదు. మంత్రి ఆలోచనతో శాంతులు జరిపిన అనంతరము సులువుగా అది పైకి వచ్చెను. ఇచట నంద భూపాలుడు బహుశ్రుతుడను మంత్రి వలన బ్రహ్మహత్యా పాతకమునుండి తప్పించుకొన్న కథ చెప్పబడినది. (ససేమిరా కథ).

ఒక సుముహూర్తమున భోజరాజు సింహాసన మెక్కుటకురాగా మొదటి సోపానము మీద ఉన్న సాలభంజిక ఆపి, విక్రమార్కుని వంటి