పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 69

ల్లాసకరుఁ డయోధ్యాపుర
వాసి సుదర్శనుఁ డనంగ వసుమతి నేలెన్. 16

చ. అతఁడు సపాదలక్షవసుధామరపంక్తికి భోజనంబు సు
వ్రతముగఁ బెట్టుచుం దివిజవర్గము మిక్కిలిఁ దుష్టిఁ బొందఁగాఁ
గ్రతువులు పెక్కు సేయుచు జగన్నుతుఁడై సరయూతటంబునం
గతిపయవాసరంబు లధికం బగుసత్ర మొనర్చుచుండఁగన్. 17

క. శారద వీణావాద్యవి
శారద తగురూప మైనచందము మెఱయన్
శారదనీరదనిభుఁ డగు
నారదముని చేరవచ్చె నరపతిఁ జూడన్[1]. 18

క. వచ్చినమునిఁ గనుఁగొని యిటు
విచ్చేయుం డనుచు మ్రొక్కి విభుఁడు చితార్ఘ్యం
బిచ్చి కృతాంజలియై నే
సచ్చరితుఁడ నైతి మీ ప్రసాదము కలిమిన్. 19

ఆ. ఎచటినుండి యిటకు నేతెంచితిరి నన్ను
ధన్యుఁ జేయ నన్నఁ దపసి వలికె
బరమధర్మశీల బ్రహ్మలోకమున నీ
దానధర్మవార్తఁ దడవ వింటి. 20

చ. విని నినుఁ జూడ వచ్చితి భువిం గడుఁ బుణ్యుఁడ వంచు నన్న నో
మునివర శిష్యుఁగాఁ దలఁచి ముద్దునఁ బల్కెద వెంతవాఁడ నే
ననుచు వినీతుఁడైనఁ గొనియాడి గుణాఢ్యుఁడ వీవు నీయశం
బనఘచరిత్ర బ్రహ్మభువనాంతము ముట్టిన దింత చాలదే. 21

  1. వచ్చె నపుడు నరపతిఁ జూడన్