పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii

వచన ద్విపద గ్రంథములను చూచియే ఈ కావ్యమును రచించినాడని తలప వచ్చును. 1520 ప్రాంతమున నుండిన యాదవామాత్యుడు వచనములో విక్రమార్కుని చరిత్రను వ్రాసినట్లును, అందు విక్రమార్కుని సింహాసనము మీది 32 బొమ్మలు చెప్పిన కథలున్నట్లును, ప్రతి కథముందు ఒక పద్యము వ్రాయబడినట్లును శ్రీ ఆరుద్రగారు చెప్పిరి[1]. సంస్కృత విక్రమార్క, చరిత్రనే గోపరాజు పూర్తిగా అనువదించి అక్కడక్కడ పెంచెనని శ్రీపింగళి లక్ష్మీకాంతము గారు వ్రాసిరి[2].

గోపరాజు ఆనుసరించిన సంస్కృత విక్రమార్క చరిత్ర యొక సంకలన గ్రంథము. ఇది గద్య పద్యాత్మికము. గద్యము సరళముగ సుందరముగ ఉండి సాధారణ జ్ఞానము గలవారికిని సులభముగ అర్థమగునట్లున్నది. శ్లోకములు స్మృతుల నుండి, సుభాషిత గ్రంథములనుండి, నీతి శాస్త్రముల నుండి, కావ్యముల నుండి, పంచతంత్రము నుండి గ్రహింపబడి, సందర్భోచితముగ కూర్చబడినవి. ఈ గ్రంథ సంగ్రథనకారుడెవరో తన పేరు తెలుపుకొనలేదు. ఇందు ద్వాత్రింశోపాఖ్యానములు విడివిడిగా ఉన్నవి. ప్రతి ఉపాఖ్యానము కథాసంగ్రహము గల ఒక శ్లోకముతో ప్రారంభమగును , మూలము

"శ్రీ పురాణపురుషం పురాంతకం
 పద్మసంభవముమాసుతం మయా
 సంప్రణమ్యచ సురా౯ సరస్వతీం
 విక్రమార్క చరితం విరచ్యతే"

 ఆను స్తోత్రముతో ప్రారంభమై

“శ్రీమతో విక్రమార్కస్యచరితం మహిమోత్తరం
 ద్వాత్రింశత్ప్రతిమాప్రోక్తం సమాప్తి మగమత్తరాం"

  1. సమగ్రాంధ్ర సాహిత్యము, 7వ సంపుటము.
  2. ఆంధ్ర సాహిత్య చరిత్ర.