పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66 సింహాసన ద్వాత్రింశిక

ఆ. దేవతరువుమాడ్కిఁ దెల్లనిగొడుగుతోఁ
గూడఁ బసిఁడికామకుంచె లచట
నిలిపి పొంతఁ గైదువులు సేర్చి యర్చన
లిచ్చె నుత్సవంబు పిచ్చలింప. 3

వ. తదనంతరంబ నానాపురాణేతిహాసశ్రవణంబులను బంచమహావాద్యప్రపంచంబులను సంగీతసాహిత్యసంగతనాట్యప్రసంగంబులను బ్రతియామదీయమానధూపదీపాదినైవేద్యమహోపచారంబులను దత్పరివారదేవతలకు నుపబృంహణంబుగా సమం బగునేమంబున నారాముండునుంబోలె నాయామినిం గడపి మఱునాఁడు కృతమంగళస్నానుండై ప్రత్యూషనిత్యకృత్యంబులు నిర్వర్తించి యప్పుడు మకరతోరణంబులునుం దెలిముత్తియంబుల తోరణంబులునుం గలువడంబులు, బరికూటంబులు మేలుకట్లునుం జీరగుండ్లును మృగనాభిలేపనంబును, ముక్తాఫలరంగవల్లికలును వెల్లివిరియ నుల్లంబుల నుల్లసిల్లుపౌరులును నాసదిగంతాగతవిద్వజ్జనజ్యోతిషికశాకునికస్వరవేదులును వందిమాగధబృందంబులును బసిండిపళ్లెంబుల మాణిక్యదీపంబులతో నివాళింపుచున్న పుణ్యాంగనలును హితరాజలోకబంధువర్గంబునుం దలకొన జయ జీవ వర్ధస్వ సుఖీభవాది శుభసూచకశబ్దంబులును బహువిధవాద్యరవంబులును, నొక్కటై దిక్కులు పిక్కటిల్ల మిక్కుటంబుగా సుముహూర్తంబున సర్వతోముఖంబగు మహాసింహాసనంబు డగ్గఱి ప్రదక్షిణంబుగాఁ దిరిగి చూచి తత్త్వద్వారంబులకడల నున్న బొమ్మల తలకడల నున్న పిన్నగద్దియలలో నెందేని నడుగిడి పెద్దగద్దియ యెక్కుట భావ్యం బని వారశూలరహితంబుగా నొక్కదిక్కున నిలిచి సకలజనకలకలంబు నుడిపి మౌహూర్తికసావధానశబ్దంబు లొలయ నిష్టదేవతలం దలంచి ప్రశస్తఖడ్గహస్తుండై పూర్ణఘటికోచితనాదావసరంబు నెదురు చూచుచుండ. 4