పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

61



వ. [1]అని చదివిన బాలుఁడు దా విని ప్రథమాక్షరము విడిచి పెట్టి "సేమిరా" “సేమిరా"యనుచున్నంత నందఱు నానందనరేంద్రుతో నానందంబు నొంది మేలు మే లనుచు నుండఁ దత్కలకలంబు మాన్పి జవనికలో గురుండు. 300

క. “సే”తువుఁ గని జలనిధిసం
జాతధనుష్కోటిఁ బడిన సద్ద్విజహతికిం
బాతకము వాయు మిత్రవి
ఘాతికిఁ బాతకమె కాని గతి గలుగ దనా. 301

వ. అని రెండవపద్యంబుఁ జదువఁ గుమారుండు రెండవయక్షరంబు విడిచి “మిరా మిరా" యనుచుండ నిట నయ్యాచార్యుండును. 302

క. “మి”త్రద్రోహి కృతఘ్న ప
విత్రగురుద్రోహి చౌర్యవిద్యాపరులున్
మిత్రశశిస్థితి మేరగఁ
బుత్రులు గలిగియును నరకమునఁ బడుదు రనా. 303

వ. అని తృతీయపద్యంబు పఠించినఁ దృతీయాక్షరంబు విడిచి “రా, రా" యను నందనుం జూచి యమందానందుం డగు నందు నుద్దేశించి శారదానందుండు. 304

క. “రా"జ! భవదీయుఁడైన త
నూజునకు న్శుభము నోజ నూల్కొను విద్వ
ద్రాజికి ధనదానము ని
ర్వ్యాజమునం జేయు మిహపరంబులు గలుగున్. 305

వ. అని యిట్లు చతుర్థపద్యంబుఁ జదివినఁ జతుర్దం బగు రకారంబుతో నవ్వికారంబునుం బాసి బాలుండు తండ్రికి మ్రొక్కి మిత్రద్రోహలక్షితంబగు ఋక్షవ్యాఘ్రవృత్తాంతం బంతయుం జెప్పిన నచ్చెరువు మెచ్చునుం బిచ్చలింప నవనీపతి జవనిక వంకఁ జూచి.

  1. ఈవచనము మొదలు కంద పద్యమువలె నడచున్నది. ఇది వృత్తగంధి.