పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58 సింహాసన ద్వాత్రింశిక

క. మొన్న నొకనిఁ దోలితి వాఁ
డిన్నగ మిట్లెక్కె వాని నిది కరుణాసం
పన్నుని క్రియ లోనిడుకొని
నిన్న విఱిచి పెట్టి నేఁడు నిజమరివోలెన్. 283

క. కూరిమి గల దని నమ్మకు
క్రూరమృగంబులకుఁ గరుణ గూడునె యిది నీ
చేరువ నుండుట నేఁటికి
నీరీతుల బుజ్జగించె నెల్లిటి కొఱవై. 284

ఆ. దానిఁ జెప్పనేల యేనిదె యొకయేఁడు
పట్టు నాఱునెలలు పట్టుఁ గాక
మిమ్ముఁ జంపి తిందు నమ్ము మీయెడ నాకు
దీనిఁ ద్రోచి బ్రదుకు తెరువు గనుము. 285

చ. అనవుడు వాఁడు నిక్కముగ నాత్మఁ దలంచి యెలుంగుఁ గూలఁద్రో
చిన నది జాఱుచుం దెలిసి చేతికి లోనగు కొమ్మ వట్టి యొ
య్యనఁ బఱతెంచి బెగ్గిలునృపాత్మజుఁ గని యల్పబుద్ది వే
మన నను నమ్ముమంటి భయమందకుమీ యని పల్కుచుండఁగన్. 286

క. కలకలఁ బలికెడు పక్షుల
కలకలములు సకలదిశలఁ గలయఁగఁ బొలయం
దళ దళికులముగ దశశత
దళదళములు విరియఁ బొద్దు తళతళఁ బొడిచెన్. 287

ఆ. తమముతోడఁ గూడఁ దరలి శార్దూలంబు
శైలగుహల కేగెఁ జాలడస్సి
తరణికిరణపంక్తి సరసఁ జెట్టుననుండి
యెలుఁగుఁగూడి బాలుఁ డిలకు డిగ్గె. 288