పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

సింహాసన ద్వాత్రింశిక



వెలిమొట్టలను దండువుల దలారుల కిచ్చెఁ
గొడిసెలఁ బరిహాసకులకు నిచ్చెఁ
ఆ. బక్కెమొట్ట రొయ్య పరిగ యింగిలికము
చీరచింపుజెల్ల నారజెల్ల
కుంటముక్కు మొదలుకొని కలవన్నియు
బంటువారికెల్ల నొంటియిచ్చె. 240

వ. ఇచ్చి యచ్చోటు వాసి బాణాసనబాణపాణియై వాగురికవాగురా కరాళంబగు వనాంతరాళంబు సొచ్చి. 241

క. బాలుఁడు మెలఁగెను మృగకుల
కాలాకృతిఁ బవనజవన ఘనశునకాళీ
కోలాహలాకాలాహిత
కోలాహల కాహళానుకూల క్రీడన్. 242

క. తొలిఁదొలిఁ జింకల మనుఁబో
తులఁ గడఁజుల లేళ్ల నిర్ల దుప్పుల మఱి యే
కలముల నెలుఁగులఁ బులులను
బలువిడిగాఁ దునిమెఁ జలము బలము న్మెఱయన్. 243

క. అయ్యెడఁ గోఱలు దీటుచు
దయ్యముక్రియ నొక్కపంది తాఁకుచుఁ దనువుల్
వ్రయ్యలుగఁ బొడిచెఁ దొలఁగం
జయ్యన నలుదెసలఁ బఱచె సైన్యములెల్లన్. 244

వ. అప్పుడు కుమారుండు కృతవాహనారోహణుండై యావరాహంబునుం దోలి వెనునంట నొంటిం జనిచని కాఱడవి నీరంబులలో జాడదప్పి దప్పిఁగొని యొక్కమడుఁగు చేరి యచ్చోటఁ దురంగంబు డిగ్గి చెట్టునం గట్టి సరసిలో జలంబులు గ్రోలి యభయుండై యచట విశ్రాంతికై నిలుచునంత. 245