పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాల ద్రోహి యైన శారదానందుని
జంపు మనిన మంత్రి సంచలించి. 221

క. దేవా! యిది మదిఁ దప్పుగ
భావింపకు భువి మహానుభావులు మదిలో
దైవిక మానుషములయం
దేవియుఁ బొలివోవకుండ నెఱుఁగుట వినవే. 222

క. జాడచెడి రాచలోగిలి
నోడుగఁ గన్నంటు వెట్టి బలుమ్రుచ్చులతోఁ
గూడిన నొరుఁ జంపిన ఱం
కాడిన మఱి విప్రుఁ జంప నర్హంబగునే. 223

వ. ఇంతియ కాదు. 224

క. భూపాల గురునిఁ జంపెడు
పాపము వల దనుచు మొక్కి పలికినఁ “గామాం
ధోపి నపశ్యతి" యనియెడు
నా పలుకు నిజంబు చేసి యతఁ డుగ్రుండై. 225

ఆ. చెడుగుబుద్దు లింకఁ జెప్పక నామాట
ద్రోవవైతివేని ద్రోహిఁ జంపు
మనుడు మాఱుమాట లాడక శారదా
నందుఁ దెచ్చి బంధనం బొనర్చె. 226

మ. ఇటు విప్రోత్తముఁ గట్టికొంచుఁ జని మంత్రీంద్రుండు చింతించి య
క్కట చంపించిన బ్రహ్మహత్య నను మ్రగ్గంజేయు నారాజు ని
చ్చటఁ బాపంబున బ్రుంగుఁ గావునఁ దదాజ్ఞాలంఘనం బైన నొ
క్కటఁ గావించి జగత్రయంబు హితముం గావింతు నంచు న్వెసన్. 227