పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాడు మంత్రిమాట లాదరించెడివాఁడె
మేదినీశుఁడండ్రు వేదవిదులు. 196

మ. నరనాథుండు సమస్తమైన జనులన్ “రాజ్ఞాం ప్రజాపాలనం
పరమో ధర్మ" యనంగ నీ పలుకుల న్భావజ్ఞుఁడై యేలఁగా
నరులందెవ్వరు నాజ్ఞ మీఱఁ జన దన్యాయప్రవృత్తిక్రియా
పరుఁడై ధర్మముఁ దప్పఁజేయుపనిఁ ద్రిప్పంజెల్లుఁ దన్మంత్రికిన్. 197

కం. జననాథుఁ డనపరాధిం
దునుమఁగ సెలవిచ్చి హితుల దొరల మనవులన్[1]
వినకుండినఁ దన్మంత్రికిఁ
దననేర్పున నతనికీడుఁ దప్పింపఁ దగున్. 198

కం. ఈచందంబున మంత్రి మ
హాచతురుం డొకఁడు విభునియానతి మొదలం
ద్రోచియుఁ ద్రోవక విప్రునిఁ
గాచె ననఁగ దొల్లి యొక్కకథ గల దధిపా. 199

కం. అనవుఁడు నాకథ నాకు
న్వినవలయును మంత్రివరుఁడు విప్రుని నేలా
గునఁ గాచెఁ బతిహితంబగు
పనిఁజేసెం జెప్పు మనినఁ బతికిట్లనియెన్. 200

బహుశ్రుతుని కథ


క. శాలిమయాన్న సదంబర
శాలి సత్యసంగ శాలీన వధూ
శాలావిశాల శీల వి
శాలాపుర మేలు నందజనపతి కడఁకన్. 201

  1. తగవులన్