పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. అరుగరె యయాతి పృథు గయ
భరత సుహోత్రాంబరీష భార్గవ శిబి సా
గర రంత్యనంగ రాఘవ
మరుద్దిలీప శశిబిందు మాంధాత లిలన్. 187

ఆ.వె. వారిలోన నెట్టివారి సొమ్మోయిది
పెద్దగాలమయ్యెఁ బృథివినణఁగి
దీని వెడలఁ దివియఁ బూనిన యప్పుడు
భూతతృప్తి వలయు భూతలేంద్ర! 188

క. అనవుడు విభుఁడది చేయుద
మని గొఱియల జెర[1]పువెట్టి యనువగు బలిభో
జనముల నసురులు సురలును
దనియంగా భూతతృప్తి తగనొనరించెన్. 189

ఆ.వె. దీనఁబొంగి భటులు దివ్యసింహాసనం
బెగయ నీడ్వఁ దాన యెగసి వచ్చె
మంత్రిఁ జూచి రాజు మంత్రీంద్ర! నీ బుద్ధి
లావుకలిమి నిట్టిలాభమయ్యె. 190

ఉ. మంత్రము లేని సంధ్యయును మౌనము లేని తపంబు వేదవి
త్తంత్రము లేని యాగముఁ బదజ్ఞత[2] లేని కవిత్వము న్సదా
తంత్రులు లేని వీణయును దానకరాగము లేని గీతముల్
మంత్రులు లేని రాజ్యము సమానము లిన్నియు వ్యర్థకార్యముల్. 191

వ. అని కొనియాడిన నిది మంత్రిప్రశంసావసరంబని యమ్మంత్రివరుండు స్వార్థంబును యథార్థంబునుగా నిట్లనియె. 192

  1. చెరువు
  2. బుధజ్ఞత