Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii


తెలుగువారి బృహత్సంహిత

“మృదుమధుర నవార్థభాసుర వచనరచనా విశారదులైన' మహాకవి ఆధునిక కాలమున ఎవరు? -అని ఎవరైన ప్రశ్నించినచో నా ప్రత్యుత్తరము - పానుగంటి లక్ష్మీనరసింహారావుగారని.

వచనరచనాధురీణులు మరికొంతమంది వుండిన జాతికి ప్రయోజనదాయకమే కాని, నష్టదాయకము కాదు గదా-

కాని తమదైన శైలివిన్యాస మాధుర్యము కలవారు కావలెనన్నచో -

రావలసిన పేరు లక్ష్మీనరసింహారావుగారిదే. రావలసిన పేరు వచ్చినది. వచ్చినది శాశ్వతమైన యశస్సు తప్ప కొన్ని కేలండర్లకే పరిధి అయినది కానే కాదు.

నిబ్బరమైన పానుగంటి వచనమున కబ్బురపడని గద్య ప్రేమికులుండరు.

అంతగొప్ప వచన మాయనకు వచ్చుట వింతకాదు. తపఃఫలితము. భాషామాధుర్య మధనోద్భూతము. జీవము భావమని వేరుగా చెప్పనవసరము రాదు.

గద్య సాహిత్య రంగమున జరుగవలసిన దానికై నాడు 1922లో పానుగంటి వారెంతగా అభిలషించిరో, ఆశించిరో తెలియుటకు ఆంధ్రసాహిత్య పరిషదేకాదశ వార్షికోత్సవమున వారి అధ్యక్ష వచనమే సాక్షివచనము.

“చిత్రములైన శైలీ భేదములు, మన భాషలో మిగుల నరుదుగా నున్నవని వేరే చెప్పనేల? రైమని పేకచువ్వ పై కెగిరినట్లున్న శైలి భేదమేది? కాకి పై కెగిరి యెగిరి ఱెక్కలు కదలకుండ జందెపు బెట్టుగ సాపుగ వాలుగ దిగునప్పటి లఘుపతన చమత్కృతి కనబఱచు శైలి పద్ధతి యేది? తాళము వాయించునప్పటి తళుకు బెళుకులు, టింగుటింగులు, గలగలలు, జలజలలు గల శైలియేది?..... భయంకరమయ్యును మనోహరమై, మహాశక్తి సక్తమయ్యు మార్దవయుక్తమై, ధారాళమయ్యు విశాలమై, స్వభావ సమృధ్ధమయ్యు సరసాలంకార భూయిష్ఠమై, సముద్ర ఘోషము గలదయ్యు సంగీత ప్రాయమై.... చదువరులకు గనుకట్టై, వాకట్టై, మదిగట్టై తలపులిమినట్లు శ్వాసమైన సలుపకుండ జేసినట్లు, ముష్టివాని చిప్పనుండి మూర్దాభిషిక్తుని కిరీటము వఱకు, భూమి క్రింది యరల నుండి సముద్రములోని గుహల వఱకు నెవరెస్టు కొండనుండి యింద్ర ధనుస్సు రంగుల వఱకు, మందాకినీ తరంగ రంగద్దంసాంగనా క్రేంకారముల నుండి మహాదేవసంధ్యా సమయ నాట్య రంగమున వఱకు మనో వేగముతో నెగురు శక్తి కల చిత్ర విచిత్ర శైలి భేదము లింక నెన్నియో భాషలో బుట్టవలసియున్నవి".

సరియగు వచనము ఎట్టిది అనుటకు ఈ అధ్యక్ష వచనమే నిర్వచనము-

ఆయన ఆశించిన వచనము వచ్చినది, ఆ వచ్చుట యితరుల వలన కాదు-సాక్షాత్తు ఆయన వలననే, సాక్షి వలననే.