పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

v

ఒక్క క్షణం....

‘సహస్ర చంద్రదర్శనం’ తరహాలో గత తరాల వారి జాతీయసంపద ‘సాక్షి’ ని ఆధునిక రూపలావణ్యాలతో తెలుగు పాఠకులకు అందిస్తున్నందుకు సగర్వంగా వుంది. 1913-20 మధ్యకాలంలో ‘కవిశేఖర’ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు రచించిన ‘సాక్షి’ వ్యాసాలు తెలుగు సాహితీరంగంలో వ్యాసరచనా ప్రక్రియకు అపూర్వగౌరవ ప్రతిష్టలను చేకూర్చాయి.

దేశభక్తి, సంఘసంస్కరణ, స్వదేశ పరిశ్రమలు, స్త్రీ స్వాతంత్య్రం, నాటకం, సాహిత్యం, మతం, ఆధ్యాత్మికత, భాష, ఎన్నికలు, వైద్యం, నాగరికత మొ॥ వందలాది అంశాలమీద సునిశిత విమర్శనాస్త్రాలను సంధించిన ‘సాక్షి’ వ్యాసరచనలకు ఈనాటికీ కాలదోషం పట్టకపోవడంలో ఆశ్చర్యం లేదు గాని, రచయిత ఊహాబలం, రచనాపటిమ దాదాపు శతాబ్దకాలం వరకు సజీవంగా ఉన్నందుకు గర్వించాలి.

‘ఆంధ్రపత్రిక’ ఆదివారం సారస్వతానుబంధంలో వారంవారం వెలువడిన ఈ అపురూప వ్యాస పరంపరను తొలుత పిఠాపురం రాజా వారు పుస్తకరూపంలో వెలువరించి మరింత ప్రచారం కల్పించారు. తదనంతరం వావిళ్ల ప్రచురణ సంస్థ మొత్తం ఆరు సంపుటాలలో ప్రచురించిన ఈ వ్యాసాలు బహుళ పాఠకాదరణ పొందాయి. చాలాకాలం పునర్ముద్రణ కాకపోవడంతో 1991లో మేము ఈ బృహత్తర బాధ్యతను చేపట్టి మూడు సంపుటాలుగా వెలువరించాము. కాలపరిణామంలో తెలుగుభాష ఎంతో ఆధునికతను సంతరించుకోవటంతో నూతనతరాల పాఠకుల పఠనాసౌలభ్యం నిమిత్తం ప్రతి వ్యాసరచనకు ప్రారంభంలో వ్యావహారికభాషలో ఆ వ్యాసరచన ముఖ్యోద్దేశాన్ని శ్రీ ఇంద్రకంటి శ్రీకాంతశర్మ గారి వివరణల రూపంలో అందించాము. మా ఈ వినూత్న ప్రయత్నాన్ని పాఠకులు యావన్మందీ హర్షించారు. ఈ ఉత్సాహబలంతో 1999లో రెండవ ముద్రణ జరిపాము.

విశ్వసాహిత్యంలో సజీవనదులవలే అన్ని కాలాల్లోనూ ప్రవహించుతూ, అన్ని తరాల పాఠకులను అలరించే సజీవరచనలు కొన్ని అయినా ఉండటం సహజం. ఈ పోలిక గల సాహిత్యసంపదలో ‘సాక్షి’ వ్యాసాలు స్థానం సంపాదించుకున్నాయని అనుభవపూర్వకంగా మాకు తెలియడంతో తృతీయ ముద్రణకు అరుదెంచాము. ‘సాక్షి’