Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాటక ప్రదర్శనము

35


నీలోకమునగుఱ్ఱాలతోఁకలజాడింపులతో నెగిరిన జోరీఁగల కాటులుగాని — దాతమొగమున శాశ్వతలోకమునందు దేవతాకాంతల పూలసురటులయూపులతో విరియు పారిజాతమకరంద బిందుసందోహములపాటులు కాదా? అట్టి మహానందసదవి యాతనికిఁ బరాత్పరుఁడు శాశ్వతముగ నీయ సంకల్పించియుండ నింతలోఁ గవి— పాపము! తొందరపడి యాతనికిఁ గాసులగంగాళమును సమర్పించు టెందులకు? దానివలన ప్రయోజనమేమి? దిక్కుమాలిన సంసారపు మిడిమేలములోఁ జర్వితచర్వణముగ గంతులు వేయించుటకేకాక మఱియెందుల కది యక్కఱకు వచ్చును? శాశ్వతసుఖ మొందనున్న వానికిఁ దుచ్ఛసుఖమీయఁదగునా? వారణాసిలో సన్న్యసింపఁదలఁచుకొని పోవువానికి వారకాంతను బారితోషికముగ నీయవచ్చునా? సతీలుఁడు (పైని చెప్పినయాతఁడు) ప్రాణములఁబాసి కైలాసమున కేఁగి నిత్యానందమున శంకరసన్నిథానమున వసియింపవలసిన పుణ్యాత్ముఁడు కదా! అట్టి యాతనికిఁ గవి యెట్లాచరించినాఁడు? ఆతనికి దేహసంబంధము వదలి పోవుటతోడనే కానఁబడఁదలచిన శంకరదేవుని రెండు గడియలకుఁ బూర్వమే కొనఁబఱచినాఁడు. అట్లు చేయుటయేకాక, శంకరుచే నాతనికిఁ గైలాసగమన ప్రతిబంధమునుగూడఁ గలుగఁజేయించి యీపాడులోకముననే యింక నిలిపినాఁడు. అది యాతని కుపకార మగునో యపకార మగునో కవి యాలోచించుకొనుట కవకాశములేని సంభ్రమముతో నెటులయిన నాతని బ్రతికింపవలయు నను పట్టుదలతో శంకరు నిప్పుడు తీసికొనిరావచ్చునా? ఆతఁడెవనికైన నిట్టియవస్థలో నీదినమునఁ బ్రత్యక్షమయ్యెనా? దేవతల నిట్లు మనయిండ్లలోని పెద్దబంట్లవలెఁ ద్రిప్పుట సహజవైఖరికి విరుద్ధముగ నుండునేమో యనుసంగతు లేవియు నాలోచింపక కవి యల్గొనర్చెను.

ప్రపంచము ప్రారబ్ధఫలానుభవస్థల మని యాలోచించినను, నూతన కర్మాచరణస్థల మని యాలోచించినను నది దుఃఖపూర్ణమైయున్నట్లు కనఁబడుచున్నది. సుఖ మనునది యున్నయెడల నది మిగులఁ దక్కువగ నున్నట్లు కనఁబడుచున్నది. ఇట్టి ప్రపంచనటనకు పరమార్థ ప్రతిబింబముగ నుండవలసియున్నప్పుడు సుఖాంతనాటకములకంటెఁ గష్టాంతనాటకము లెక్కువగ నుండవలసినట్లు కనఁబడుచున్నది. పోనిండు, అవియు నీవియు సమముగనైన నుండవలసినదా! అటు లున్నవా? పోని? ఆసేతుహిమాచలపర్యంత మున్నభాషలలో నొక్క కష్టాంత నాటకమైన నున్నదా? ఏల యుండకపోవలయును? మనవా రట్టిది యుండఁగూడ దనికూడ నియమ మేమైన నొనర్చిరా? అదికూడఁ జేసినారు. ❝మంగళాదీని మంగళనుధ్యాని మంగళాంతాని❞ యని ప్రబంధ లక్షణమును నిర్వచించినప్పుడు ప్రకృతిలో రూపాయకు పదునాలుగణాల భాగమును బనికిరానిదానిఁ గా మనవారు పరిహరించియే వైచినారు. మిగిలిన యీబేడకాసు నావరణమందును ❝మృచ్ఛకటికా❞ కారుని మొదలు నీసారంగధర చరిత్ర కారునివఱకు నందఱు గిరగిరఁ దిరుగుచు గుడుగుడు గుంచము లాడుచుఁ- బిష్టపేషణముగ వర్ణించిన ప్రకృతులనే వర్ణించుచుఁ-జెప్పిన వాక్యసందర్భమునే రవంత మార్చి చెప్పుచు—భాషాంతరీకరించుచు—శబ్దాభిప్రాయచౌర్యము లవలీలగ నొనర్చుచుఁ బ్రకృతిజ్ఞానమునఁ దప్ప మిగిలినయన్నియసందర్భములలో నన్ని యవకతవకలలో నొకనితల పై నొకఁడు దాఁటిపోవఁ బ్రయత్నించుచున్నారు.