Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాటక ప్రదర్శనము

33


బాధ నవిచ్ఛిన్నముగఁ బడుటకే పరమాత్మ మనల సృజించెనా? అతఁ డంత నిర్దయాత్ముఁడా కాదు. ఈ కష్టములన్నియు మనము. తెచ్చుకొనినవే మన మనుభవింపదగినవే-వానిని నివారించుటకు భగవండుఁడైనఁ బ్రత్యక్షము కాఁదగినదే-

ఆ!ఆ!అదెట్లు? సుఖమునే యెల్లప్పుడు కోరుకొనునరుఁడు కష్టమును గోరుకొనునా? అది ప్రకృతి సిద్ధముఁ గాదే? కాన నట్లూహించుటకు వలనుపడదే? ఇంతకంటే విరుద్ధముండునా? ధూమశకటమును నిర్మించిన మహాధీశాలికైన నీదినమున నిన్నిగంటలకు శకటము తిరుగఁబడు ననియుఁ, దన్మూలకముగ జననాశన మగు ననియు గ్రహించుటకు బుద్ధి గలిగియుండునా? అట్లెఱుంగక యాతఁ డెక్కియుండినఁ జావఁగూడదా? ఈమరణము బుద్ధిపూర్వకముగనే తెచ్చికొనినదా? అట్లు చచ్చిన జనులంద ఱెఱిఁగియుండియే చచ్చుచున్నారా? నావలు మునుఁగఁ జచ్చిన వారందఱు చావు నపేక్షించియే సముద్రయానమునకు సమకట్టిరా? వ్యాధులచేఁ జచ్చినవా రందఱు మనఃపూర్వకముగనే మరణించుచు న్నారా? అయ్యయ్యో!మన మీట్లోనర్చిన నట్లు మానినఁ జత్తుమని యెఱుఁగుదుమా? స్వప్నమందైన నట్టితలంపు మనకు లేదే!అట్టిచో మన కష్టములను మనమే తెచ్చుకొంటి మని పలుకుట సమంజసముగ నున్నదా? సాహసముగ నున్నట్లు లేదా?

ఉన్నట్లే యున్నది. కాని యథార్థముగ లేదు. జీవు లనాదులు. అయినను దైవసృష్టిలోనివారు. పశువులకంటె భిన్న జ్ఞానశక్తిగలవారు. మంచి యేదో చెడ్డ యేదో-కాసుబంగారమేదియో కాకిబంగారమేదియో-గుల్ల యేదియో గట్టి యేదియో-పైతళుకేదో లోని సారమేదో –అపథ్య మేదో పథ్యమేదో-భగవత్పృసాదితజ్ఞానతేజో లేశమునఁ గనిపెట్టి నిరాకరణీయ మును నిరాకరించి, యవలంబనీయము నవలంబించి కృతార్థులు గాఁదగినవారు. అట్టివారు మొగము మెఱుఁగులకు మోసపోయి, రంగుతళుకునకు రంజిలి, పైబింకములే పరమార్థశాశ్వత చిహ్నము లని నమ్మి, దిగుడుబావియే యాకాశపుష్పక మని తలఁచి మజువఁదగినదానిని వల్లెవేసి పఠించి, పఠించవలసిన గ్రంథమును బాజవైచి, కొఱవిదయ్యమును గృహదీపముగ భావించి, యాంతరాకాశవాణి ననాదరించి; బుద్ధిపూర్వకముగ-సదసద్విజ్ఞాన సాహాయ్య శూన్యముగఁ దద్భోధనా వ్యతిరేకముగఁ గూడఁ దప్పులు మనము చేయునపుడు తత్ఫలము లనుభవించ నక్కఱలేదా? స్వయంకృతాపరాధసంభూత కష్టసంతతిలో మనకు భగవంతుఁడు-కవికల్పనము ననుసరించి తోడుపడి మనల నానందముగ నోలలార్చునా? దూలగొండిగింజలు చల్లి తులసిమొక్కలకయి కాంక్షింపఁదగునా? తండ్రినిఁ జెప్పుతీసికొని తన్నిన కొడుకు దేవతల పుష్పవృష్టికయి తలయెత్తం దగునా? ❝అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ❞ మ్మని పెద్దలు పలుకలేదా? కర్మ బద్దుల మగు మన మీ జన్మమునఁ బ్రారబ్ధకర్మ మనుభవింపవలసినవారము కామా? ఈజన్మ-ప్రస్తుత కార్యస్థలమైనను బూర్వ మునకు ఫలస్థలము కాదా? జనులలో బుద్ధిమంతులకంటే బుద్ధిహీనులు ప్రబలసంఖ్యగలవారయి యుండుటచే సత్కర్మాచరణులకంటె దుష్కృతికర్త లధికసంఖ్య గలవారని చెప్పవలయునా? కావున సుఖపర్యవసన్న జీవులకంటెఁ గష్టపర్యవసన్న జీవులే మిగుల నేక్కువ సంఖ్యగలవారని తేలుచున్నదే? అదిగాక కష్టములయినను సుఖములయినను స్వయంకృత పూర్వకర్మ ఫలములే కాని మనల బాధించుటకై కాని, సుఖపెట్టుటకై కాని పరాత్పరునిచే నీయఁబడనట్లుగూడ గొంచెము గోచరించుచున్నదా? దుష్కర్మము ప్రబలము గాఁగ దాని