పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. నాటక ప్రదర్శనము

ప్రసంగం కూడా ఒకవిధంగా సారంగధర నాటక ప్రదర్శన విమర్శతోనే ప్రారంభమైంది. ఈ ప్రసంగంలో విపులంగా చర్చించిందేమి టంటే నాటకాలలో, ఎన్ని దిక్కుమాలిన మలుపులు, మెలకువలు చూపించి అయినాసరే, నాటక కవి దానిని సుఖాంతంచేసి తీరాలా? అని ప్రశ్న. కవికే ఇంత నియమం ఎందుకు? ప్రకృతిని అనుసరించి పోవలసిన అతను భరతవాక్య మాంగళ్యంకోసం ఎందుకు ప్రాకులాడాలి?

ప్రపంచంలో మనుషుల జీవితాల నడక, వారి వారి కష్టాల కలయిక, కదలిక, ఒకలాగ వుంటూంటే - జీవితం సుఖమయంగా వుందనుకోపడం, ఉంటుందనుకోవడం ఆత్మ వంచన కాదా?

అయితే - మనవారు సుఖాంత నాటకాలను రచించడంతో ఉద్దేశం ఏమై ఉంటుంది, మనమే పూర్వం పడిన కష్టాల్ని ప్రస్తుత సుఖావస్థలో తలుచుకుంటే తాత్కాలికంగా కొంత మనస్సు కలతపడినా, వర్ణనాతీతమైన ఒక ఉత్సాహం ఔన్నత్యంతో కూడిన ఒక విచిత్రానందం మన మనస్సుల్లో మొలక వేస్తుంది.

మనకు కష్టాంత నాటకాలు లేకపోవడం లోటే - కష్టాంత నాటక దర్శనానుభవం వల్ల ప్రజలకు మనస్సులో సంతృప్తి, ప్రాపంచిక వైరాగ్యం, దైవంమీద మనస్సు మరలడం, మోక్షం సంపాదించాలనే కృషి వంటి పరమ సద్గుణాలు పుడతాయి అని - జంఘాలశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

క్రిందటిసారి యుపన్యాసమున సారంగధర చరిత్ర ప్రదర్శనముఁ గూర్చి పలికితిని. కరపాదఖండనము నొందిన సారంగధరుఁడు యమసదనమునకుఁ బోవుటకు బదులుగా నాలుగవయంకమునఁ దండ్రి సదనమునకే పోయెను. ఖండింపఁబడిన కాలు సేతులు యథాస్థా నముల నదుకుకొనినవి. పరలోక ప్రయాణసన్నద్ధమైన యాతని ప్రాణము దిరుగఁ జిలుకకొ య్యకు మూటదగిలించి స్థిరపడినది. చావక తప్పనివానిని జావనీయకుండ నేల? చచ్చినవాని నిగూడఁ దిరుగ దేవతామాహాత్మ్యముల బ్రతికింప నేల? సావిత్రీసత్యవంతుల చరిత్రములో సత్యవంతుఁడు సంపూర్ణముగఁ జావలేదా? చిత్రవిచిత్ర సృష్టికర్మ కళాకలనాకోవిదుఁడగు కవిబ్రహ్మ తిరుగనాతని ముక్కున నింతయూపిరి యతనిధర్మమా యని పోయలేదా?