Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సారంగధర నాటకప్రదర్శనము

29


లేల వ్రాయవలయును? చేతఁగాదందురా! పోనిండు. ప్రకృతిగొంతుక నులిమి గ్రంథమును వ్రాసి ప్రజను బాధ పెట్టనేల? నాయనలారా! కవిత్వమే చెప్పినఁగాని కాలము గడువదా? బ్రతుకుట కెన్నిసాధనములు లేవు? చేసికొనుట కెన్ని పనులు లేవు? అయినను గవిత్వమువలన నీదినములలో జీవనము గడచునా? ఎట్లయినను నాటకకౌక్షేయకమునఁ బ్రకృతిని జంపిన బ్రహ్మహత్యగూడ మనకెందులకు? ఇఁక మీరు కవిత్వమును మానుఁడు. నేనుపన్యాసమును మానేద-


వాణీదాసుఁడు—మీరు చెప్పిన ధోరణినిబట్టి నాటకమున వచనమే కాని పద్యమైన నుండఁగూడనట్లు స్పష్ట మగుచున్నదికాదా?
జంఘా—కాదన్న వారెవ్వరు?
వాణీ—కాళిదాసాదులు తమనాటకములలో శ్లోకములు చేసిరి కాదా?

 

జంఘా—వారెందులకుఁ జేసిరో యెట్లు చేసిరో యదియంతయు ముందరియుపన్యా సములఁ జెప్పనా? విషయము బహువిపుల మగుటచేత నొక్కయుపన్యాసమున సర్వము పూర్తియగునా? నాటకశైలి యెట్లుండవలెనో, పాత్రా చిత్య మనఁగ నేమో, యుక్తిప్రతియుక్తివైఖరి యెటులుండవలయునో, నాటకమునఁ బద్యము లుండవచ్చునో లేదో, ఉండిన నేపద్యము లెట్లుండవచ్చునో, శుభాంతకష్టాంతనాటకముల తారతమ్య మెట్టిదో యీమొదలగు నంశము లింకఁ గ్రమముగ నాకుఁ దోఁచినట్లు మనవిచేసికొందును. ఆలస్య మైనందులకు క్షమింపుఁడు.