పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

సాక్షి

అయ్యో! ఆలాగున నవ్వెద రెందులకు? ఇదివఱకు సంపాదించినది చాలదా? ఎవరు తినను? అదిగాక యెల్లకాలమును సంపాదనయే యగునెడల నేలాగు? పుణ్యము పురుషార్థము నక్కఱలేదా? మనల నే దేవాలయములోనికి రానిచ్చెదరు? మనయింట నే పదిమంది బ్రాహ్మణులు భోజన మొనర్చెదరు!" అని యనుచున్నారా? ఏమీ! ఈ క్రొత్తమాటలు! బ్రహ్మోపాసకులు నెందఱను మన మాదరించుట లేదు? ఆ సంబంధముల కార్యములకు మన మోహినకొలఁది యిచ్చుటలేదా? ఇప్పుడు పూర్వ మతము నాచారము మాట యెందులకు? సాహసముచే, నుదార స్వభావముచే నట్టివానిని ద్రోసిరాజని, బంధువుల నందఱను గూడ విడనాడి, పూర్వాచారపరాయణులమాట లెంతమాత్రమును గణింపక, నన్ను బ్రాహ్మవిధిచేతఁ జెట్టఁబట్టినారు కదా! నాయందు మీ కట్టి యభిమాన మున్నప్పుడు నాకోర్కెను నెఱవేర్పఁదగదా? ప్రతిదినమును జెవి నిల్లుకట్టుకొని పోరుచుంటినే? ఏ దది యని యనుచున్నారా? ఇదేమి చోద్యమమ్మా! ఇంతలోనే మఱపా? మరియొకమాట చెప్పుచున్నాను వినుఁడు. మీ ప్లీడరీ మాటనుగూర్చి; అది యెట్లు జరుగు నని యనుచు న్నారా? మన భూములమీఁద సంవత్సరమునకు వచ్చు పండ్రెండువేల రూపాయల యాదాయము చాలదా? ఇండ్ల యద్దెలవలన వచ్చు వేయిరూపాయల రాఁబడి చాలదా? మాని యేమిచేయు మనెదవని యనుచున్నారా? చేయుటకుఁ బనులే లేవా? మీతండ్రిగారు ప్లీడరీ చేసిరా? ఆ వృత్తికంటె వేరువృత్తి లేనేలేదా? ఏమియు కనఁబడ దనుచున్నారా? అయ్యయ్యో? చేయుట కుచితములగు పనులు లేకపోవుట యేమి? సాక్షులకు వింతవింత పాఠములు చెప్పుటయే పనియా? ఈనాముదారులకు రయితులకుఁ దగవులు కల్పించు టయే పనియా? అన్నదమ్ములకు విపరీతపుటాలోచనలు చెప్పుటయే పనియా? తండ్రి కొడుకులకు భేదపువ్రాతలు పుట్టించుయే పనియా? జమీందారులకు వింతయాలోచనలు చెప్పుటయే పనియా? తండ్రులను బీల్చి పిప్పిచేసి కొడుకులకు ముష్టిచిప్ప చేతి కిచ్చుటయే పనియా? వారసత్వములు వెదకుటయే పనియా? జమీందారీలు పంచుకొని ప్రభువు లనిపించుకొనుట కే తలమాసినవానినో వెదకి సింగారించి వానికిఁ బెట్టుబడి పెట్టి యాడించు టయే పనియా? ఇట్టి పను లర్హము లని మన శ్రుతులలోఁ గాని స్మృతులలోఁ గాని యున్న దని యెవరైనఁ జెప్పుదురా?

ఎంతదూరము చదువుచున్నావు అని యనుచున్నారా? అట్టి .పను 'లింకఁ జేయవ లదు. ఏమియుఁ జేయనియెడల నిన్ని నగ లేలాగున వచ్చునని యనుచున్నారా? ఈ నగలకొఱకు నే నేమియు దేవులాడలేదు. ఇవి లేకున్నను నేను విచారించుదానను గాను. ఇవి నగలా? ఎన్ని సంసారశల్యములో? ఆc? చేయుటకుఁ బనులే కనఁబడకున్నవా? కన్నులు పెట్టుకొని జూచినయెడలఁ గనఁబడకపోవునా? అబ్బ! అట్టె వాఁగక ఏమిచేయుమంటివో నీవే చెప్పరాదా అని యనుచున్నారా? ఏమీ! నాది వాఁగుడుక్రిందఁ దిగినదా? రిప్రెష్మెంటు రూములోపల మీ త్రాగు డనుకొన్నారేమి? నన్ననఁగ నే ననక యూరకుందునా? పోనిమ్ము. ఆగొడవ యెందుల కనుచున్నారా? నే నేగొడవయుఁ జేయను. మీరు నేఁ జెప్పినట్లుమా త్రము నాయందు దయయుంచి చేయవలయును. ఇన్నాళ్లఁబట్టి యీపని చేసియున్నాను. ఇప్పుడు క్రొత్తపని యేమి చేయుటకుఁ దగుదు ననుచున్నారా? తమ కేమి? ఎంత సేపు మన పొట్ట సంగతియే మనము చూచుకొనవలయునా? దేశ క్షేమ మింత యేమాత్రమైన నక్కఱలేదా? చేయుట కెన్ని పనులు లేవు? యామినీ పాఠశాలలుంచి చదువురానివారలకుఁ