పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సారంగధర నాటక ప్రదర్శనము

23



రెండవయంకమున మొదటిరంగమున సారంగధరుఁడును, మంత్రి పుత్రుఁడును, మఱికొందఱు బాలురును బ్రవేశించిరి. కొంత సేపు వారుకుండబంతి నాడిరి. కాలిబంతి యెగిరి ప్రమాదవశమునఁ బైన వ్రేలాడుదీపమును బగులఁగొట్టెను. లోపలిచమురు భగ్గుమనెను. పాక కాలిపోవునని భయపడితిమి. కాని యట్లు జరుగలేదు. తరువాత మంత్రిపుత్రుని చేతినుండి గోటి బిళ్ల యెగిరి సభలో నున్న యొకకోమటి పిల్లవాని కణఁతకుఁ దగులుటచే నాతఁడు సొమ్మసిల్లి పోయెను. అంతటనాతని తండ్రి గోలుగోలున నేడ్వసాగెను. కోమటిమాత్రము నాటకపద్ధతికి విరుద్ధముగాఁ బాటలతో నేడ్వక మాటలతోడనే యేడ్చుచుఁ బిల్లవాని నింటికిఁ దీసికొవీపోయెను. అంతఁ గోతికొమ్మచ్చినాడు చుండగా సారంగధరుఁడు చెట్టుమీఁ దనుండి పడెను. వెంటనే తెరకూడఁ బడెను.

ద్వితీయరంగారంభమున మంత్రిపుత్రుఁడును, సారంగధరుఁడును బావురముల నెగరవైచుచుఁ బ్రవేశించుచు నిట్లు పాడిరి.

❝పావురాల నెగరవైచి పట్టుకొందమా?
మావరాలమూటలైన శ్రీవరాంగసుషమ మీరు❞ ‖పా‖

ఇట్లు పాడియెగరవైచిరి. నాటకగాథ ననుసరించి పావుర మొక్కటి ప్రక్కనున్న చిత్రాంగిమేడమీఁద వ్రాలి కూరుచుండుటకు బదులుగా నెదుటనున్న మాశిష్టుకరణము మేజస్ట్రీటుగారి నెత్తిమీఁదవ్రాలి రెట్టవైచెను. ఆకస్మికమైన మైలవార్త విన్న యాతఁడువలె నతఁడు సల స్నానమునకై పోయెను. ప్రక్కగోతిలోఁబడి పావుర ముండఁగా నది చిత్రాంగిమేడమీఁదనే యున్నట్టు భావించి సారంగధరుఁ డిట్లు పాడెను.

❝పొగరుబోఁత? మా కపోతమా!
తగదు వడిగ తిరుగ తిధిగకున్న పొగ రడంతు❞ ‖పొగరు ‖

పావురము రాకపోవుటచే సారంగధరుఁడు చిత్రాంగి యింటికి వెళ్లుటకు స్థిరపఱచుకొనెను. మంత్రిపుత్రుఁడు మలయమారుతములోఁ గొంత మందలించెను గాని దానిని సారంగధరుఁడు శరకరాభరణముతోఁ జప్పఁబఱచెను. రెండవరంగము నిట్లు ముగిసెను.

మూఁడవరంగమున సారంగధరుఁడు చిత్రాంగి మేడలోఁ బ్రవేశించెను. చిత్రాంగి యాతనిఁ జూచుటతోడనే లేచి గొంతుక బొంగు సవరించుకొని ❝ఆ❞ యని ప్రక్కనున్న శ్రుతితోఁ గంఠమును గలిపి ❝ఊ❞ యని పిడేలువానికిఁ గీర్తనకై తలయెగుపుతో సంజ్ఞ చేసి-

బిలహరి-ఆది.

❛ఒకసారి కౌంగిట నొత్తిన న్నేలరా! ఓరీ! మారాకారా!
తెకతెకను నుడకఁగ తొగలరోయఁడు! పొకపొకల గ్రమ్ముచు
నొడలుపొక్కెను అకట! యింక ❝బ్రదుకంగఁజాలను!
నికటమున న నృట్టి గట్టిగ ‖నొక‖

అనుచు హస్తపాదవిన్యాసములచేఁ దారపువారిని గానఁబఱ చుచుఁ దారక మంటునట్లు పాడెను. అంతట సారంగధరుఁడు నడుము బిగించుకొని-