Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

సాక్షి


3. విమర్శక స్వభావము

కవి వాణీదాసుడు, సాక్షి సంఘం ఉపన్యాసకుడు జంఘాల శాస్త్రీ, జుట్టూ జుట్టూ పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. వాగ్యుద్ధం తీవ్రమైంది. అసలు కారణం ఏమంటే - వాణీదాసు కవే కాడనీ, తనకి కవిత్వం అంటే ఏమిటో తెలియదనీ జంఘాలశాస్త్రి ఉడికించినట్టు, వాణీదాసు ఆరోపణ. అతనిది ఆసమ్మ ఓసమ్మ అరిగచొప్పి అలుకు గుడ్డకవిత్వమని జంఘాలశాస్త్రి నిందించక పోలేదు. ఆ మీదట వారిద్దరికీ రవరవలు పెరిగి, కవిత్వ సంబంధమునకు మించిన విమర్శ పేరిట మాటలు పెరిగాయి. చివరికి వ్యవహారం తన్నులాటల వరకు వెళ్లింది. అదికూడా అయ్యాక వాణీదాసూ, జంఘాలశాస్త్రీ, సిగ్గుపడి తలలు వంచుకు కూర్చున్నారు.

ఆమీదట సాక్షి కలగజేసుకుని కవిత్వం అంటే ఏమిటో, అది ఏం చేయవలసి ఉంటుందో, కవిత్వవిమర్శ ఎలా సాగాలో విపులంగా వివరించాడు.

నే నీరాత్రి మా సభాకుటీరమునకుఁ బోవుసరికి మాకవి యగు వాణీదాసుఁడు, జంఘాలశాస్త్రీయుఁ గోడిపుంజులవలెఁ గాళ్లు దువ్వుచు గొఱ్ఱెపొట్టేళ్లవలెఁ దలలువంచి బుసకొట్టుచు నాఁబోతులవలె ఱంకెలు వేయుచు మల్లులవలెఁ దొడలు దండలు చఱచుచుఁ బంజాబీ మైసూరీ పద్ధతుల పదవిన్యాసపు గమనికలతోఁ జేయి చేయి గలుపుకొనుటకు సిద్ధమై యుండిరి. కలహకారణము గోచరింపలేదు. కాని వారిని శాంతిపఱచుటకుఁ బ్రయత్నించితిని. ఎందుల కీ కచాకచి కదనోత్కంఠత యనియడుగ వారెవ్వరును నామాటను వినిపించుకొనలేదు. కాని, కవి నిష్కారణకఠిన ముష్టిప్రహారము నోరులేని నడుమనున్న బల్ల కొక్కటి ప్రసాదించి యిట్లు గద్దఱించెను.

వాణీ-ఏ మంటివి? నాకుఁ గవిత్వమే తెలియదా? అది లోకజ్ఞానమునఁగాని రాదా? దానికి దేశాటన మావశ్యకమా? ఆ! ఆ సేతు హిమాచలపర్యంతము నీ వల్లల్లాడని స్థలమున్నదా? కాలి దురదయే తీరినది కాని కవితాలేశమైన నంటినదా? కాఱులఱచుట కవిత్వ మనుకొంటివా? తిట్టినతిట్టు తిట్టకుండఁ దెంపులేక తిట్టు దిట్టరితనము నిరవశేష శబ్దజాల నిరాఘాటప్రయోగనిపుణత యనుకొంటివా? ఇదిగో! నీ కబ్బినవి గండ్రతనము, పెంకితనము, తెగనీలుగుఁదనము, నుడుకుఁబోతుతనము, వెక్కిరింపుఁదనము, గయ్యాళితనము, గల లగల భేద మెఱిఁగి నీవు కవిత్వము చెప్పఁగలిగినప్పుడు నన్నది క్షేపింపుము. అది నీకుఁ బదునాల్గు భువనములు దిరిగిన రాదు.