Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామ్యభాషా గ్రంథ పఠనము

13

ఇదిగాక భాషాభిరుచిచే నందుఁ బూర్ణ పాండిత్యము సంపాదించుకొన వచ్చునని నీవు చెప్పితివే? అట్లు సంపాదించుకొనుట కవకాశము లేదు. అట్టి తరగతులు బి.యే.కు నేకాలేజీలో నింకఁ బెట్టనేలేదు. “హానర్సు”కు మాత్రము ప్రెసిడెన్సీ కాలేజీలో నేర్పాటున్నది. దేశభాషల తోడి యింటర్మీడియేటు పరీక్షకుఁ గ్రిష్టియనుకాలేజీలో నేర్పాటు లేదు. ఏర్పాట్లు చూచిన నట్లున్నవి. చదువుకొనుచున్న పిల్లలసంఖ్య చూచిననట్టున్నది. ఆంగ్లేయ విద్యాపండితులగు గురువుల (Professors) యొక్క పట్టుదల యటులున్నది. అదిగాక వీరికింత దేశీయభాషావైషమ్య మెందులకు? హరిభాష కాదయ్యెను. వారు చదువుకొనిన (Latin, Greek) లాటిను, గ్రీకు మొదలగు నితరభాషలు కావయ్యెను. వారి కెంతమాత్రము తెలిసినభాష కాదయ్యెను. అట్టి యంశములో వారు తటస్థులుగ నుండుటకు బదులుగఁ దెలిసిన భాషాభిమానుల యభిప్రాయముల నిరసించుట చింత కాదా?

నేను ఈ నవీనపద్ధతి నవలంబించి మూఁడు సంవత్సరము లయియుండును గాఁబోలు. ఇది యెట్లు నడచుచున్నదో బాగుగఁ గనిపెట్టుట కింకఁ దగినంతయవకాశము కలుగలేదు. అదిగాక ముప్పది నలువది లక్షల వ్యయముచేఁగాని యీనవీనపద్ధతి ననుసరించి యేర్పాటులన్నియు జరుగవయ్యెను. అంతధనవ్యయ మొనర్చి తగినంత కాలము దీనినడకఁ జూడకుండ విడుచుట తగినపని కాదు. అందుచే నీకోరిక నెఱవేఱలేదని నీవు దుఃఖింపక యూరకుండుము.

జంఘా మనకోరిక విద్యాసంఘమువారు తీర్చువరకు మనహృదయములకు శాంతి యుండునా? వారు తీర్చువఱకు మన మూరుకుండువారము కాము. నిరంతరము ప్రార్థించు వారము. దుఃఖింపక యూరకుండు మని యెంతసులభముగఁ జెప్పితివి? నానోటియొద్ద నున్న యన్న మెవఁడైన నెగమీటుకొనిపోవ నేను గంటఁ దడి పెట్టువాఁడనుకాను. నేను దున్నుకొని జీవించుపొల మెవఁడైన నాక్రమించుకొనఁగ నే నేడ్వను. నాయింటిలోని సర్వస్వము సకాంతాపుత్రకముగఁ జోరులు హరించిన నే నంత దుఃఖించువాఁడను గాను. కాని చేటలోఁబడి “క్యావు” మనునది మొడలు హరియని కాటిలోఁ బడువఱ కుపయోగించు కొను దేశభాష కిట్టి

ఇచ్చట జంఘాలశాస్త్రి-గద్గదస్వరముతోఁ గనులు దుడుచుకొని యూరకుండెను. అతని హృదయమార్దవము గాంచి మేము తెల్లఁ బోయితిమి. కాలాచార్యులు, కవియు వాదములోఁ గూడ నప్పటికి నాకును జంఘాలశాస్త్రికిని జరిగిన సంభాషణ చెరియొకఁడు వ్రాసెను. మిక్కిలి రాత్రి యగుటచే ముగిసెను.