Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

సాక్షి

హెచ్చగుటయుఁ దద్విషయిక గురువులకుఁ బని హెచ్చుటయుఁ జదువుకొను బాలుర మనస్సులకు భారము హెచ్చగుటయుఁ దప్పక సిద్ధించును. ఇదియుఁగూడ నాలోచనీయాంశము కదా?

జంఘా-మిగిలినవి తగ్గించుకొనవచ్చును. బంధువుల పరమాన్న భోజనమున్నకై ముందుగఁ దల్లిని బస్తుపెట్టుదురా! తల్లిని గౌరవింపని జ్ఞానశూన్యుఁడు బంధుమర్యాద కేడ్చినందువలన విశేషగౌరవ మున్నదా? అట్టివాఁడు తాను బస్తుండుట మంచిది కాదా? మన భాషామాతను మనము వదలఁ దలఁచుకొన్నప్పుడు మనకు విద్యతోఁ బనియేలేదు మాతృభాషానిరసనముకంటె మౌఢ్యము మంచిది. మన భాషామాతయొక్క యభివృద్ధికి నుపయోగమునకు, నుజ్జీవనమునకు, సదుపాయమునకు, సౌఖ్యమునకే మనకితరోపవిద్యలుగాని మఱి యింకెందులకు? తల్లి చావుపిల్ల పోఁతపాలతో నారోగ్యముగఁ బెరుఁగగలదా? శవమున కలంకారము లేల? ప్రాముఖ్యమున, బలాత్కార పఠనార్హత్వమున రాజభాష యెట్టిదో దేశభాషయు నట్టిదే! ఈ భాషా ద్వయముతరువాతనే యితర విషయపఠనము. అంతేకా! తోఁక ముందు, మూతి వెనుకనా?

నేను-పూర్వపుఁ బద్దతివలన ననఁగా నన్నియు నిర్బంధపఠసార్హములు సేయుటవలన నప్పటి బాలుర జ్ఞానమునకు వైశాల్యమే కాని లోఁతు తక్కువగ నుండెనని కనిపెట్టఁబడినది అనఁగా విశేష విషయములు వారికిఁ దెలియునుగాని యేవిషయముననైనఁ బూర్ణముగఁ దెలియదు. అట్టి విద్యాపద్దతి సంతుష్టిగ లేక బాలురజ్ఞానము స్వల్పవిషయిక మయ్యును గంభీర మగునట్లు చేయుటకై యీనవీన పద్ధతి-యనఁగఁ దమ కభిరుచి గల విషయముల స్వేచ్ఛానుసారముగఁ జదువుకొనుపద్ధతి- కల్పింపఁబడి తదనుగుణ్యముగ పఠన విషయములు ఖండములక్రింద విభాగింపఁబడినవి. విశేషవిషయములలో మిడిమిడి, జ్ఞానమున్న వారి డెందునను దెలియనివాఁడే! కొలఁది విషయములలో నైనఁ బూర్ణముగఁ దెలిసినవాఁడు వానిలోనైనను దెలిసినవాఁడే యగును. దేశ భాషలలో నభిరుచియున్నవా రాభాషలనే తీసికొని వానిలో నపూర్వపాండిత్యమును సంపాదించు కొనవచ్చును. పూర్వపధ్ధతి ననుసరించి తేలినవారు నూర్గుఱకన్న నవీసపద్ధతి ననుసరించి తేలినవారు పదుగు రధికలోకోపకారకులు.

జంఘా-ఏదీ? అట్లు తేలినవారేరి నాయనా? ఇఁక మునుఁగుట తప్ప తేలుట యేమిటి? దేశభాషాభిరుచిచే నేతరగతిలో నెందఱు చేరిరో లెక్కలనుబట్టి తెలియఁగలదు. 1912 సం.లో నింటర్మీడియేటుకు 5823 రును, బి.యే.కు 1012 గురును విద్యార్థులు గలరు. 1912-1913 సం.లో రెండవతరగతి కాలేజీలలో ‘‘నింటర్మీడియేటు పరీక్షలలో మొదటితరగతిలో నరవము చదువుకొనువాఁ డొక్కఁ డున్నాఁడు. రెండవతరగతిలో నార్గురున్నారు. హిందూసర్వకళా ప్రధానశాల కంతకు నాసంవత్సరములో బి.యే. తరగతిలో నొక్కఁడున్నాఁడు. భాషా పాండిత్యము సంపాదించుకొనఁదలఁచి చదువుకొనువారు 71 మంది తెనుఁగువారు, 15 గురు కర్ణాటకులు, 28 గురు మళయాళస్థులు, 27 గు రుర్దుభాష వారు నున్నారు. సంస్కృతము చదువుకొనువారు మాత్రము 282 మంది యుండుటచే నీ నవీనపద్ధతి దేశీయభాషల కెంతమాత్రముపయోగించుట లేదని స్పష్టపడుచున్నది” అని మొన్న జరిగిన వాదములో మ.రా.శ్రీ హానరేబిల్ శ్రీనివాసశాస్త్రులుగారు చెప్పినారు.