పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7


2. గ్రామ్యభాషా గ్రంథ పఠనము

ఒకనాడు జంఘాలశాస్త్రి ఒక కాగితాల బొత్తి చేత్తోపుచ్చుకుని, నెత్తికి తగిలిన ద్వారం దెబ్బనుకూడా లక్ష్యపెట్టకుండా వగర్చుకొంటూ సాక్షి సంఘానికి హుటాహుటిన వచ్చాడు.

అతను తెచ్చిన కాగితాలు వార్తా పత్రికలవి. అందులో అతన్ని కలవలపరిచిన వర్త “దేశ భాషల్ని ఇంటర్మీడియేట్, బి.ఏ. క్లాసుల్లో తప్పనిసరిపఠనీయాలుగాచేర్చడానికి విద్యాసంఘంవారు లంగీకరించలేదు - అని.

ఈ వార్త ఆధారంగా సాక్షికి, కాలాచార్యులుకి, జంఘాలశాస్త్రికి, కవి వాణీదాసుకీ చర్చ జరిగింది. జంఘాలశాస్త్రి ఆ పత్రికావార్తకి తీవ్రంగా ఆందోళన ప్రకటించాడు. విద్యా వ్యవస్థలో, దేశభాషల పట్ల ప్రభుత్వం అవలంబించే ఉదాశీన వైఖరి, వారి చర్చనీయాంశం.

ఇంటర్మీడియేట్ క్లాసులోకి వచ్చే బాలుడికి దేశభాషను మానడానికి గాని చదవడానికి గాని, స్వేచ్చా? - ఈ సిద్ధాంతం మీ ఇంగ్లీషుభాష కెందుకు ఉపయోగించుకో కూడదు? ఇక్కడ మళ్లీ తేడా చూపించడమా? ఇది మా దిక్కుమాలిన దేశభాషలకు మాత్రమే చెల్లవలసినదా? అని జంఘాలశాస్త్రి ఆవేదన.

ఈ చర్చ అంతా విద్యావిధానంలో ద్వంద్వ వైఖరి గురించి.

కవియుఁ గాలాచార్యులు నేను మాసభాభవనమున రాత్రి కూరుచుండి- "వేసవి కాలమారంభమైనది. ఉష్ణ మధికముగ నున్నది. మామిడిపిందె లింకను వచ్చుటలేదు. ఎఱ్ఱమిరెపుఁగాయల కున్నరుచిలోఁ బదునాలుగవవంతైనఁ బచ్చిమిరెపుఁగాయల కుండ” దను నిట్టి వట్టి వెఱ్ఱి మాటలతో సన్నిహితఋతువునుగూర్చియు, సాపాటును గూర్చియు సహజముగ మాటలాడుకొనుచుండ నెత్తికి టంగున తగిలిన ద్వారపు దెబ్బను లక్ష్యపెట్టక కాకితములబొత్తి చేతఁ బుచ్చుకొని వగర్చుచు లోనికి మా జైన దేవుఁడయిన జంఘాలశాస్త్రి వచ్చి “అయ్యయ్యో ఇంక నేమున్నది? ఇంక నిట్లు గూరుచుండిరా?" యని బిగ్గఱగఁ దొందరతో నరచెను.