Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

అధునాతన సంఘమునకు షడ్దర్శనములుగా సాక్షి దర్శన మిచ్చినది. అది వ్యాస దర్శనము. అనేకములను గద్య గ్రంథములని మనము సరిపెట్టుకొనవచ్చును. కాని, సాక్షి సంపుటములు గద్యకావ్యము లనిపించగల గుణ సమన్వితములు. కోణములు మారి సాక్షిపైన వంద పరిశోధన గ్రంథము లుదయింపజేయ వచ్చును. వేయి వుపన్యాసము లీయవచ్చును.

నాటి నాటకములలో సంగీతము అన్ని తావుల నుండరాదని తెలుపు నుపన్యాసము, “సాయంతన పాకసామగ్రీ సందర్భమును సంగీతములో వెల్లడించి యుంటమా? అట్లే చేసి యుండిన యెడల మన యిరుగుపొరుగు వారు మన చేతులు కాళ్ళు గట్టి తలలు నున్నగా గొఱిగించి నిమ్మకాయ పులుసుతో రుద్ది, బెత్తముచే మోది యున్మత్త శాలకు పంపించి యుండరా? అజ్ఞాన స్వరూపమగు గ్రుడ్డయినను గడుపునొప్పి రాగ గ్యారుక్యారున నేడ్చును గాని సరళ స్వరము పాడునా? ప్రొయ్యి యలుకుచుండఁగ దేలుచేఁ గుట్టబడిన వనిత మొఱ్ఱో మొఱ్ఱో యని యేడ్చును గాని ముఖారిపాడి తాండవించునా? అట్లే చేసియుండిన యెడల దేలుమాట యటుంచి దయ్యపుబాధయని చీపురుకట్టలతో వీఁపు తట్టుఁ దేరఁ జావగొట్టి యుండరా?

కన్నకొడుకు మరణింపఁగఁ దల్లి తలకొట్టుకొని యేడ్చి యేడ్చి కొయ్యవాఱ పోవలసినదికాని మొలకట్టుకొని యుత్కంఠమున బాడిపాడి ముక్తాయించి తీరవలసినదా? దూడచచ్చిన యావైన దిగులు పడి డిల్లపడి, గడ్డిమాని నీరు మాని దూడను ముట్టితో స్పృశించి కంటనీరు పెట్టుకొని తహతహచే గింజుకొని 'యంబా' యని యఱచునే మనమంత కంటె నధమ స్థితిలో నుండవలసి వచ్చెనే-ఎంత మహాప్రారబ్దము పట్టినది! పాట కొఱకే మనమప్పుడుప్పుడు పాడుకొనుచున్నాము. కాని ప్రాపంచిక సర్వవ్యాపారములను బాటలతో గాక మాటలతోడనె మనము నిర్వహించు కొనుచుంటిమని మన మందఱమెఱింగిననంశమే కదా!.... ఆహా మనుష్యత్వము పశుత్వమున కంటె నేడాకులు తగ్గినదా? ” అని వ్రాసిన పానుగంటి తత్త్వమును మనము గ్రహించవలెను. వాస్తవిక దృక్పథమునకు మనలను తీసికొని వచ్చుటలో ఆయన చెప్పునవి దెప్పునవి కొల్లలు కొల్లలు. ఒక్కొక్కప్పుడాయన రచన గిల్లునట్లుండును. గిల్లును. అవసరమైనప్పుడు మన చర్మము దళసరి అని భావించినప్పుడు రక్కియైన నొక్కి చెప్పును గాని వదలుట యనునదియుండదు. అందువలననే సాక్షి, ఛాందసులకు లక్ష్మీనరసింహ స్వప్నము!

పానుగంటి వంటివారుకాక మరియొకరు అట్టి గ్రాంథిక వచన రచనము అరసున్నలతో బండిరాలతో చేసియున్నచో నీ కాలమున నిగిరిపోయి వుండును. కారణము ఒఠి వచన రచనా పాటవము చాలదు.

పానుగంటివారు కవి. విమర్శకులు. భావుకులు. సమాజ దర్శనము మరువని వారు. సంఘ సంస్కరణము కోరినవారు. పైబడి రచనా సంస్కరణము కోరిన వారు. ఆకట్టుకొనుటలో కనికట్టు కనిపెట్టిన వారు.

కొంచెము ముందునకు వెళ్ళినట్లనిపించవచ్చు గాని-

నాటకములలో ' కన్యాశుల్కము' ఎట్టిదో గద్యరచనములలో 'సాక్షి' అటువంటిది.