పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వలక్షణసారసంగ్రహము

139


వీరు వా రనునట్టిబుద్ధివిభేద మెన్నఁడు లేదు గాం
ధారిపుత్రశతంబునందుఁ బృథాతనూజులయందున్.

66

ఆదిపర్వము

ఉ.

నేఁటికిఁ జెల్లెఁగాక రజనీచరకోటికి నెల్లినింకఁ బో
దాఁటి కవాటముల్ విరుగదాఁచుట చేతులతీఁట వోక మై
తీఁటలు వోవ రక్కసులఁ దీర్చుట రాముఁ డొనర్పకున్నె పెన్
వేఁటకు రావణాదిమృగబృందముఁ దార్చుటలంచుఁ దార్చినన్.

67

భాస్కరునిరామాయణము

క.

పరిజనములకున్ నీకున్
ధరలోన సగంబె చాలు తక్కినసగముం
గర ముచితంబుగఁ బాండవ
వరునకు ధర్మజుని కిచ్చి బ్రతుకుము పుత్రా.

68

ఉద్యోగపర్వము

ఉ.

వాలికెచూపు మత్తవనబర్హికిశోరపులాస్యలీలపై
వ్రాలిచి పచ్చకప్పురపువాసనతోడి ముఖారవిందతాం
బూలము మోవిమోవిపయి మోపుచు రాధిక కిచ్చు ధూర్తగో
పాలుఁడు బ్రోచుఁగావుత నపారకృపామతి మంత్రియన్ననిన్.

69

భీమఖండము

17 లక్షణము

క.

రలల కభేదం బని యి
మ్ములఁ గొందఱు వసుచరిత్రమున లక్ష్యము ని
శ్చలగతి నారసి కలుఁగం
బలుకుదు రది యెల్ల కల్ల పర్వతనిలయా.

70