పుట:సర్వలక్షణసారసంగ్రహము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వలక్షణసారసంగ్రహము

125


గీ.

పశుపతిప్రాప్తిసామ్రాజ్యఫలున కబ్జ
బంధుబంధురతేజోవిభాసురునకు
విశ్వవిభునకు సరిలేరు విశ్వజగతి
ననిన నివి వర్గవళులనఁ దనరుఁ గృతుల.

6

పెద్దరాజు కావ్యాలంకారచూడామణి

అఖండవడికి

4 లక్షణము

గీ.

హల్లునకు హల్లు వడి యిడు నడుపు దాని
తుదిని స్వరము ఘటిల్లిన నది యఖండ
వడి యనఁగఁ బొల్చుఁ గృతుల దేవాదిదేవ
యనుచుఁ జెప్పిన శైలకన్యాధినాథ.

7


ఉ.

అన్నవు తండ్రియట్ల విను నంతియ గా దటమీఁద రాజ వే
మన్న గొఱంత లేదు మణిమండనముఖ్యము లైన కానుక
ల్మున్నుగ సీత నిచ్చి జనలోకపతిన్ శరణంబు వేఁడుమీ
సన్నఁపుఁగార్యము ల్వలదు నందియ మే లటుగాక తక్కినన్.

8

భాస్కరరామాయణము

ఉ.

ఆ కులవృత్తి రాఘవుశరాగ్రమునందుఁ దృణాగ్రలగ్న నీ
రాకృతి వార్ధి నిల్చుట దశాననుఁ డీల్గుట మిథ్య గాదె వా
ల్మీకులు జెప్పకున్నఁ గృతి లేని నరేశ్వరువర్తనంబు ర
త్నాకరవేష్టితావని వినంబడ దాతఁడు మేరు వెత్తినన్.

9

భైరవుని శ్రీరంగమహాత్మ్యము