పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్వామికి నమస్కారంబు లొసంగి చనిరి ముక్తికాసారనీరంబుల మునింగి
భావనారాయణదేవుని దర్శించిననరుండు శుభసంతతులఁ బొంది పునర్జన్మరహితుం
డగు నీక్షేత్రమాహాత్మ్యంబు వినిన వినిపించినఁ బఠించిన లిఖించిన నజ్జనుండు
విష్ణులోకప్రాప్తుం డగు నని కుంభసంభవుండు శౌనకునకుఁ జెప్పిన విని వసిష్ఠుం
డంబరీషున కెఱింగించిన నతం డత్యంతసంతుష్టాంతరంగుం డయ్యె.

117


సీ.

వల నొప్ప బ్రహ్మకైవర్తపురాణోక్త, మై సర్సనగరమాహాత్మ్య మలరు
నది యేను శాలివాహనశకాబ్దంబులు, పాటింప వేయునార్నూటడెబ్బ
దా ఱగుభావమహావత్సరంబున, భావనారాయణ దేవదేవు
నానతివలన ని ట్లాంధ్రం బొనర్చి యా, స్వామికి దేవతాచక్రవర్తి


తే.

కర్పణం బొనరించితి నధికభక్తి, నిమ్మహాపుణ్యచారిత్ర మిద్ధరిత్రి
నాసుధాకరతారార్క మగుచు సజ్జ, నోత్తములయిండ్ల నేప్రొద్దు నుండుఁగాత.

118


చ.

పరమకృపాలవాల నిజభక్తజనావనశీల యోగిహృ
త్సరససరోమరాళ దివిషన్మునిసంస్తుతిలోల దీనమం
దిరమురసాల సంప్రథితనిర్మలకీర్తివిశాల యక్షకి
న్నరనరసాధ్య ముఖ్యసుమనస్సముదాయనితాంతపాలనా.

119


క.

అక్షుద్రభుజపరాక్రమ, శిక్షితదైతేయ నిఖిలశిష్టవిధేయా
చక్షుఃకర్లకదంబా, ధ్యక్షాంగశయాన బుధవితాననిధానా.

120


తరలము.

దర సుదర్శనశార్ఙ్గనందకధారణా శుభకారణా
హరిహయప్రముఖాఖిలత్రిదశావనా మునిపావనా
సురవిరోధివరూథినీపరిశోషణా నతపోషణా
వరశకుంతకులాధినాయకవాహనా నవమోహనా.

121

గద్యము. ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితా
సామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి
గంగనామాత్యపుత్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ
తిమ్మకవిసార్వభౌమప్రణితం బైనసర్పపురక్షేత్రమాహాత్మ్యం
బనుపుణ్యచరిత్రంబునందు సర్వంబును
దృతీయాశ్వాసము.